Friday, March 23, 2012

Confessions of an Economic Hitman - John Perkins : ఒక దళారీ పశ్చాత్తాపం - కొణతం దిలీప్


మూడేళ్ళ క్రితం HRF వాళ్ళు ముద్రించిన "విస్తాపన-విధ్వంసం" అనే పుస్తకం చదివాను. అందులో అభివృద్ధి పేరిట, సెజ్ ల పేరిట ఆది వాసీలకు, పేద ప్రజలకు, సహజ వనరులకు జరుగుతున్న అన్యాయం గురించి కళ్ళకు కట్టినట్టు రాసారు. నన్ను, నా ఆలోచనలని  ఎంతగానో ప్రభావితం చేసిన పుస్తకాల్లో అది ఒకటి. మన చుట్టూ జరుగుతోన్న (జరుగుతోందని మనం అనుకుంటున్న) అభివృద్ధి అనే నాణేనికి మరో వేపు ఏముందో తెలుస్తుంది ఈ పుస్తకం చదివాక.

ఇప్పుడు ఈ పుస్తకం "ఒక దళారీ పశ్చాత్తాపం" కూడా అదే కోవలోనికి వస్తుంది. HRF వాళ్ళ పుస్తకం మన రాష్ట్రం లో జరుగుతున్న దోపిడీ గురించి రాస్తే, ఈ పుస్తకం లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దోపిడీ గురించి రాసారు. అగ్ర రాజ్యంగా వెలుగుతోన్న అమెరికా చేసిన దురాగతాలను, అభివృద్ధి ముసుగులో మానవాళికి అది చేస్తున్న ద్రోహం గురించి ఈ పుస్తకం లో రాసారు.

ఈ పుస్తక రచయిత జాన్ పెర్కిన్స్ అమెరికా తరపున నియమించబడ్డ ఒక ఎకనామిక్ హిట్ మాన్ (ఇలాంటి ఒక పదం ఉంటుందని ఈ పుస్తకం ద్వారానే తెల్సింది నాకు). చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న వెనుజులా, ఈక్వడార్, ఇరాన్, ఇరాక్, ఇండోనేసియా లాంటి దేశాల్లోని ప్రభుత్వాలని, ప్రజలని అభివృద్ధి పేరిట మభ్యపెట్టి ఆయా దేశాలు ఎప్పటికీ తీర్చలేని రుణాలిచ్చి వారిని తమకి (అమెరికా కి ) బానిసల్లా మార్చే ప్రక్రియ కోసం నియమింపబడ్డ వారే ఈ దళారులు. ఒకప్పుడు అమెరికా లో వుండిన బానిసత్వానికి ఇప్పుడు నాగరీకత, అభివృద్ధి పేరు చెప్పి కొత్త ముసుగు తొడుగుతున్నారు. అమెరికా పాటిస్తున్న రెండు నాల్కల ధోరణిని నగ్నంగా మన ముందు నిలబెడుతుంది ఈ పుస్తకం. గ్లోబల్ సామ్రాజ్య స్థాపన లో భాగంగా కార్పోరేట్ స్వామ్యం పీడిత దేశాలని ఎంత తెలివిగా దోచుకుంటుందో రచయిత ఈ పుస్తకం ద్వారా చెప్పారు. ఈ దోపిడీలో భాగం గా మనం (మానవాళి) కోల్పోయిన సహజ (నదులూ, అడవులు), మానవ వనరులు, సంస్కృతులు, జీవ జాతుల గురించి తెల్సుకుంటూ వుంటే రేపటి తరానికి మనం ఏమి మిగిల్చి ఇస్తున్నాం అన్న ఆలోచన రాక మానదు. దీని గురించి సామాన్య ప్రజలమయిన మనం చేయగలిగినది ఏముంది అన్న ప్రశ్నకి సమాధానం ఏమిటి?

170 పేజీల ఈ పుస్తకం చదవడానికి నాకు రెండు వారాలు పట్టింది. ఇందులో రాసిన ఏ ఒక్క విషయం గురించి నాకు ఇంతకు ముందు ఎలాంటి అవగాహన లేకపోవడమే కారణం. ఇప్పటి వరకూ ప్రపంచం లో ఏ దేశం అయినా కరెన్సీ ని ముద్రించుకోవడానికి అందుకు సరిపడా బంగారు నిలువలనో, లేక వనరులనో చూపించాలని విన్నాను. కానీ అమెరికా అలాంటి రూల్ ఏదీ పాటించకుండా కరెన్సీ ని ముద్రించి ప్రపంచ దేశాలకి అప్పులిస్తుందని ఇందులో చదివి ఆశ్చర్యపోయాను. ఇదేమి న్యాయం. ఎవరూ అడగరా?

తెలుగు అనువాదం చాలా సరళంగా సాగింది. మానవాళి విధ్వంసానికి కారణమయ్యే  ఈ అభివృద్ధి (???) అనే ఊబిలో మనం రోజు రోజుకీ ఎలా కూరుకుపోతున్నామో తెల్సుకోవాలంటే ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.


Mr .నూకయ్య



మనోజ్- సనా ఖాన్ ప్రేమించుకుంటారు. రాజా-కృతి కర్బందా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఈ రెండు జంటల మధ్య ప్రేమ ఎలాంటిది, స్వతహాగా దొంగ అయిన మనోజ్ లో పరివర్తన ఎలా వస్తుంది అనేదే ఈ సినిమాలోని కథ.

ఈ కథ కొంచెం కొత్తగానే వుంది. కిడ్నాప్ డ్రామా మధ్య నడుస్తుంది సినిమా అంతా.బోర్ కొట్టకుండా రెండు గంటలు గడిచిపోతాయి. ఆఖరిలో ఊహించని ఒక ట్విస్ట్ చాలా బాగుంది. బ్రాహ్మి చిన్న రోల్ చేసాడు. వేరే ఎవరన్నా అయితే చాలా చిరాగ్గా వుంటుంది కానీ బ్రాహ్మి కాబట్టి భరించగాలిగాము ఆ క్యారెక్టర్ లో. సెకండ్ హాఫ్ లో వచ్చే మొదటి పాట (ఒకే ఒక జీవితం ) లోని సాహిత్యం చాలా బాగుంది. మిగతా పాటలు పర్వాలేదనిపించేలా వున్నాయి. టెక్నికల్ వాల్యూస్ , స్టంట్స్  ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి మనోజ్ నటన తో పాటు. మొదటి సగం మాత్రం బాగా తీయలేదనిపించింది. సెకండ్ హాఫ్ బాగుంది.


మనోజ్ లో చాలా energy వుంది. సినిమా భారం అంతా అతనే మోసాడు చివరిదాకా. సనా ఖాన్ మర బొమ్మలా వుంది, నటన కి పెద్ద ఆస్కారం కూడా లేదు. కృతి కర్బందా తీన్ మార్ లో లాగానే ఇందులో కూడా హోం లీ క్యారెక్టర్ చేసింది. చాలా చక్కగా వుంది. మిగతా అందరూ పర్లేదు.

మనోజ్ చేసిన ఈ కొత్త ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చినట్టే వుంది. వీక్ డే అయినా కూడా హాల్ దాదాపు నిండింది.

నువ్వా- నేనా



గమ్యం లాంటి అసాధారణమయిన సినిమాలో జోడి కట్టి మనల్ని మెప్పించిన శర్వానంద్, అల్లరి నరేష్ ఈ సారి మళ్ళీ జోడి కట్టి కామెడీని ఎలా పండించారో చూడాలనుకుని ఈ సినిమాకి వెళ్లాను. చాలా బాగుంది అనో, అస్సలు బాగోలేదు అనో చెప్పలేను కానీ  ఎలాంటి expectations లేకుండా వెళ్తే ఒకసారి చూసి కొంచెం నవ్వుకుని వచ్చేయ్యొచ్చు.

కథ ఏమీ లేదు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి కోసం ఒకరి పై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ నవ్వుల్నీ పండించడానికి ప్రయత్నిస్తారు. ఆఖరికి గద్దలా మరొకడు ఆ అమ్మాయిని తన్నుకుపోతాడు. మధ్యలో బ్రహ్మానందం, కోవై సరళ ల కామెడీ. బ్రహ్మానందం కామెడీ బాగుంది కానీ కోవై సరళ మాత్రం ఎప్పటిలానే OA  చేసి విసిగిస్తుంది. నరేష్ కి ఇలాంటి రోల్ చేయటం చాలా ఈజీ. అతను బాగా చేసాడు. శర్వానంద్ ని ఇంతవరకూ సీరియస్ రోల్స్ లో చూసి ఇప్పుడు కామెడీ అంటే కొంచెం కొత్తగానే వుంది కానీ చెత్తగా మటుకు లేదు :) పర్వాలేదు అనిపించింది. ఇక శ్రియ లో చాలా ఓల్డ్ లుక్ వచ్చేసింది. పాటలు రెండు బాగున్నాయి, మిగతావి నచ్చలేదు.

హాల్ కి వెళ్లి చూడాల్సిందే అనదగిన సినిమా కాదు. ఇంకో మూడు, నాలుగు నెలల్లో ఎలానూ టీవీ లో వచ్చేస్తుంది. అప్పుడు చూసి నవ్వుకోవచ్చు.

Friday, March 16, 2012

ఇష్క్



సినీ రంగం లో పైకి ఎదగాలంటే టాలెంట్,కృషి తో పాటు కొంత ప్రాక్టికల్ థింకింగ్ కూడా వుండాలి. నేల విడిచి సాము చెయ్యడం అన్ని సార్లు కలిసి రాదు. నితిన్ విషయంలో గత పదేళ్లుగా ఊరిస్తున్న హిట్ ఈ ఇష్క్ సినిమా రూపంలో అతనికి దక్కింది. ఇందులో చిలిపిగా అల్లరి చేసే చలాకి కుర్రాడి పాత్రలో నితిన్ ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ కోసం శరీరాన్ని కష్టపెట్టడం వలన అనుకుంటా ఆ అలసట ముఖంలో కనిపిస్తుంది. అయితే ముఖంలో maturity వచ్చింది. నిత్య మీనన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మాయి నటనలో చాలా పరిణీతి కనిపిస్తుంది. అజయ్ కి కూడా మంచి పాత్ర దక్కింది. మిగతా నటీ నటులు కూడా చక్కగా చేసారు. పాటలు రెండు, మూడు బాగున్నాయి. ఫోటోగ్రఫి కి మంచి మార్కులు పడతాయి.

కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా ఒక్కో సీన్ జరిగే కొద్దీ ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వల్ అయే అప్పటికి climax ని ఊహించగలం కానీ అక్కడికి కథ ఎలా చేరుకుంటుందో అన్న సస్పెన్స్ వుంటుంది. ఇక కామెడీ కూడా పెద్ద గొప్పగా లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది. మొత్తానికి ఒక సారి చూసెయ్యొచ్చు :)

డేగ రెక్కల చప్పుడు - యండమూరి వీరేంద్రనాథ్

 

నేను చదివిన పుస్తకాలలో నాకు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకాల్లో యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు చాలా వున్నాయి. ఈయన నవలల్లో నేను మొట్ట మొదట చదివింది "నల్లంచు తెల్ల చీర". అప్పటి నుండి ఆయన నవలల్లో మూడు నాలుగు పుస్తకాలు తప్ప మిగతావి ఏవీ  వదిలిపెట్టకుండా చదివేసాను. దొరికినంత వరకూ కొని దాచుకున్నాను కూడా. ఈయన రాసిన కాసనోవ 99 , తులసి దళం, అష్టా వక్ర లాంటి థ్రిల్లర్స్ తెలుగులో మరే రచయిత ఇంత ఆకట్టుకునేలా రాయలేరేమో అనిపిస్తుంది. ఈయన ఇంగ్లీష్ నవలల నుండి కాపీ చేస్తారని, రచనా స్వేచ్చ ఎక్కువ తీసుకుంటారని అంటారు కానీ నేను ఇంగ్లీష్ నవలలు ఎక్కువ చదవలేదు కాబాట్టి నాకు అలా ఏమీ అనిపించదు. ఈయన రాసిన నవలలు అన్నిటి గురించి ఒక పోస్ట్ రాయాలని అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు.

ఈ నవల "డేగ రెక్కల చప్పుడు" సాక్షి ఆదివారం edition లో సీరియల్ గా వచ్చినప్పుడు నేను కావాలనే చదవలేదు. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏకబిగిన చదివేయ్యాలి నేను. వారం వారం ఎదురు చూడటం నా వల్ల కాని పని. అందుకే నవలగా వచ్చాక చదివాను. ఇంతకు ముందు ఈయన రాసిన "ఒక వర్షాకాలపు సాయంత్రం" అనే నవల లోని కథకి, ఈ నవలలోని కథకీ దగ్గరి పోలికలు వున్నాయి. అయితే రెండూ వేటికవే బాగున్నాయి.

ఈ కథ విషయానికి వస్తే రామకృష్ణ శాస్త్రి భారత సైన్యం లో పని చేసిన ఒక మాజీ ఉద్యోగి. నరనరాన దేశభక్తి ని జీర్ణించుకున్న అసలు సిసలు సిపాయి. తల్లి తండ్రి ని పోగొట్టుకున్న ఇతనికి ఉన్న ఏకైక తోడు ప్రేమించిన అమ్మాయి వైదేహి. అనుకోని పరిస్థితుల్లో అల్-ఖైదా దృష్టి ఇతని మీద పడుతుంది. వాళ్ళకి అవసరమయిన ఒక ఫైల్ కోసం ఇతన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు. ఈ విషయం అతనికి ఆఖరి నిమిషంలో తెలుస్తుంది. వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసి వాళ్లకి సహాయపడతాడు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యని రామకృష్ణ ఎందుకు ఈ పని చేసాడు, అతని అసలు mission  ఏంటి అన్నది అసలు కథాంశం. ఇందులో మొదటి భాగం అంతా ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక, చారిత్రక నేపధ్యం, తాలిబాన్ల ఆవిర్భావం, ఆఫ్ఘనిస్తాన్ లోని గిరిజన తెగల ఆచార వ్యవహారాలూ,రష్యా-అమెరికాల మధ్య నలిగిపోయిన ఆఫ్ఘన్ పౌరుల హక్కుల గురించి వుంటుంది. 

స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఎత్తుగడలనీ, మత చాంధస వాదుల మూర్ఖపు ఆలోచనలనీ, సామన్యుల బ్రతుకులని నేల రాస్తున్న ఉగ్రవాద సంస్థల అరాచకత్వాన్నీ, వాటికి కొమ్ము కాచే దేశాధినేతల కుయుక్తులనీ, సమాజంలో పాతుకు పోయిన స్వార్థాన్ని, కరడు గట్టిన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రచనా స్వేచ్చ ఎక్కువగా తీసుకున్నప్పటికీ నవల మొత్తం చదివాక అవసరమే అనిపిస్తుంది. కొన్ని యథార్థ సంఘటనలు, కొన్ని కల్పితాలు కలగలిపి రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద కలాపాలకు అద్దం పడుతుంది.