Friday, August 3, 2012

మెట్ల మీద - మిడ్కో కథలు



విప్లవ రచయితల సంఘం (విరసం) వారు ప్రచురించిన ఈ పుస్తకం లో మిడ్కో రాసిన పద్దెనిమిది కథలు వున్నాయి. ఇందులో మొదటి పది కథల్లో మధ్య తరగతి స్త్రీ-పురుష సంబంధాల గురించిన విశ్లేషణ వుంటుంది. అన్ని కథలూ
స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల చుట్టూ తిరుగుతాయి. రచయిత ఒక స్త్రీ అవడం మూలాన అనుకుంటా అన్ని కథల్లోనూ స్త్రీ పాత్ర పరంగా కథ చెప్పబడుతుంది.

 తర్వాత వచ్చే ఎనిమిది కథలు మాత్రం నేను ఇంతవరకూ చదవని అంశం గురించి వున్నాయి. నక్సల్స్ ఉద్యమ నేపధ్యం లో తెలంగాణా ప్రాంతం లోని స్త్రీల కష్టాలు, కన్నీళ్లు, వేదన, పట్టుదల, పోరాటం గురించి రాసారు. చివరి కథ అయిన "మెట్ల మీద" మాత్రం కథా నాయకుడి కోణం లోనుండి చెప్పబడింది. ఉద్యమం లో నుండి బయటకి వచ్చేసాక అతని చుట్టూ ఉన్న సమాజం లో జరిగిన మార్పులకు, కుటుంబ సభ్యుల, స్నేహితుల దృక్కోణం లో మార్పులకు, వారి దృష్టిలో తన స్థానం గురించిన సంఘర్షణ నేపధ్యం లో వుంటుందీ కథ. ఈ ఎనిమిది కథలూ తెలంగాణా మాండలికం లో వున్నాయి.

మొత్తానికి అన్ని కథలూ బావున్నాయి. మిడ్కో అంటే గోండు (ఒక ఆదివాసీ తెగ) బాషలో మిణుగురు పురుగు అట :)

Thursday, August 2, 2012

పాలగుమ్మి విశ్వనాథం - ఆత్మకథ


ప్రముఖ రచయిత, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అయిన పాలగుమ్మి పద్మరాజు గారి తమ్ముడు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు. పశ్చిమ గోదావరి జిల్లా లోని తిరుపతిపురం అనే ఊరిలో 1919 సంవత్సరం లో జన్మించిన విశ్వనాథం గారు తెలుగు వారి ముంగిట్లోకి AIR ద్వారా లలిత సంగీతాన్ని తీసుకువచ్చిన ఆద్యులు. ఈయన స్వరకర్త, గాయకుడు, వీణా విద్వాంసులు కూడా."అమ్మ దొంగా..నిన్ను చూడకుంటే నాకు బెంగా" అన్న పాట (ఈయన రచించి, స్వరపరిచినది..వేదవతి ప్రభాకర్ గారు పాడింది) ఇప్పటికీ తెలుగు వారి లోగిళ్ళలో వినిపిస్తూనే వుంటుంది..ఇంకా ఇలాంటివే ఎన్నో మధురమయిన పాటలు ఎన్నింటినో పరిచయం చేసిన విశ్వనాథం గారి ఆత్మ కథ ఎంతో బావుంది.

గోదావరి జిల్లాలో ఆయన గడిపిన బాల్యం, గాంధీజీ గారు చేప్పట్టిన హరిజనోద్ధరణ ఉద్యమం లో విశ్వనాథం గారి బాబయ్య గారి పాత్ర గురించిన వివరాలు ఎంతో ఆసక్తి కలించాయి. తర్వాత విశ్వనాథం గారి సాహిత్య అభిలాష, సంగీత సాధన కోసం చెన్నై వెళ్ళడం, అక్కడ గొప్ప గొప్ప విద్వాంసులతో పరిచయాలు, సినీ రంగం లో ఆయన పాత్ర, అక్కడి నుండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో ఉద్యోగం ఇవన్నీ ఆయన మాటల్లో వివరించారు. ఆకాశవాణి లో పనిచేసేటప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి లాంటి ప్రముఖులతో సాహచర్యం ఏర్పడింది విశ్వనాథం గారికి.కృష్ణ శాస్త్రి గారు రాసిన ఎన్నో పాటలకు విశ్వనాథం గారు స్వరాలు సమకూర్చారు. వీరిద్దరి కలయికలో వచ్చిన సంగీత రూపకాలకు నేటికీ ఎంతో మంది అభిమానులున్నారు. తెలుగు సంగీతం లో ప్రముఖులయిన వారెంతో మంది ఒకప్పుడు విశ్వనాథం గారి దగ్గర శిష్యరికం చేసిన వారే.ఆకాశవాణి లో పదవీ విరమణ అనంతరం క్రైస్తవ మత బోధకుడయిన హ్యుబర్ట్ సికింద్రాబాద్ లో స్థాపించిన అమృతవాణి కైస్తవ మిషన్ కి భక్తి గీతాలు సమకూర్చారు విశ్వనాథం గారు.

తెలుగు జాతి రత్నాలలో ఒకరిగా ఎన్నదగిన పాలగుమ్మి విశ్వనాథం గారిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులతో సత్కరించింది. ఈ ఆత్మకథ సంకలనం చదవడం ద్వారా మరుగున పడిన ఆకాశవాణి జ్ఞాపకాలు మదిని పలకరించాయి.