Saturday, April 28, 2012

Housefull - 2


హిందీ సినిమాల్లో ఈ మధ్య కామెడీ వి బాగా హిట్ అవుతున్నాయి కానీ నేను మాత్రం ఎందుకో ధైర్యం చేయలేకపోయాను ఇన్ని రోజులూ అలాంటి సినిమాలు చూడటానికి. అప్పుడెప్పుడో 'రెడీ' చూసాను, అదేమో నాకు నచ్చలేదు. అందుకే ఈ సారి ఎలాంటి expectations పెట్టుకోకుండా వెళ్లాను ఈ సినిమాకి.

సూపర్ అని చెప్పలేను కానీ బాగుంది సినిమా. వల్గర్, చీప్ కామెడీ లేకుండా హాయిగా మనసారా నవ్వుకునే హాస్యం వుంది సినిమా అంతా. కథ తెలుగు లో వచ్చిన 'హంగామా' సినిమా ని పోలి వుంది (ఆ సినిమా నేను మొత్తం చూడలేదు కానీ టీవీ లో వచ్చే ముక్కలు చూశాను). లాజిక్ ని పక్కన పెట్టి నలుగురి జంటల మధ్య వచ్చే confusion వలన పుట్టిన కామెడీ ని ఎంజాయ్ చేసి రావొచ్చు . నటీ నటులందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు బాగా చేసారు. పాటలు రెండు బాగున్నాయి, మిగతా రెండు పర్లేదనిపించాయి.

లవ్లీ



రొటీన్ ప్రేమ కథా చిత్రమే ఇది. కాన్సెప్ట్ లో కొత్తదనం లేకపోయినా ఫస్ట్ హాఫ్ ఆహ్లాదంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ వేసే వేషాలు కొంచెం విసుగు తెప్పిస్తాయి. ఆది పెర్ఫార్మన్స్ బాగుంది. డాన్సు లు బాగా చేస్తున్నాడు, చూడటానికి చక్కగా వున్నాడు. అయితే డైలాగ్ డెలివరీ లో మాత్రం ఇంకొంచెం కష్టపడాలి. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకోవాలంటే తప్పదు మరి . లవర్ బాయ్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోతాడు. హీరోయిన్ నాకు నచ్చలేదు. వెన్నెల కిషోర్ రోల్ బాగా పండింది.

మరీ బోర్ కొడుతుంటే వెళ్లి చూడొచ్చు ఈ సినిమాని. మాకు పోయిన ఆదివారం చూడటానికి ఇంకేమీ సినిమాలు మిగలక దీనికి వెళ్లాం :)

The Mighty and Mystical Rivers of India - Alaka Sankar


ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదం చదివాను నేను. భారతదేశం లోని వివిధ నదులు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, పురాణాల్లో వాటి ప్రాశస్త్యం, వాటి పరీవాహక ప్రాంతాలు, అక్కడి పుణ్యక్షేత్రాలు, సంస్కృతులు, సంప్రదాయాలు మొదలయిన విశేషాల సమాహారం ఈ పుస్తకం. మనకి ఎంతో పవిత్రమయిన గంగ, యమున, గోదావరి, కృష్ణ లాంటి నదుల చరిత్ర, వాటి ఔన్నత్యం తెల్సుకోవడం ఎంతో బాగుంది.

ఈ పుస్తకం ద్వారా మొత్తం భారతదేశం అంతటా ప్రవహించే నదుల గురించి చదవడం వలన అవి ప్రవహించే అన్ని ప్రాంతాల గురించి కూడా ఎన్నో ఆసక్తికరమయిన విషయాలను చదివి తెల్సుకోవచ్చు. అంతా చదివాక నాకు ఉత్తర భారత దేశ యాత్ర చేయాలన్న కోరిక ఇంకా ఎక్కువయ్యింది :) ఎప్పటికి తీరుతుందో మరి?

బెంగాలి నవలలు, కథలు - 1



దేవదాసు - శరత్ - ఈ కథ అందరికీ తెలిసిందే. పాతదో, కొత్తదో 'దేవదాసు' సినిమా చూడని వాళ్ళు వుండరేమో. అయితే ఈ సినిమా కి మూలమయిన నవల ఎలా వుంటుందో చదవాలన్న కోరిక నాకెప్పటి నుండో ఉండింది. నవల చదువుతున్నంత సేపు ఈ మధ్యే చూసిన హిందీ 'దేవదాసు' గుర్తొస్తూనే వుంది. సినిమాకి, నవల కి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఇప్పటి తరం వాళ్లకి ఆనాటి రచన చదవడం కంటే సినిమా చూస్తేనే నచ్చుతుందేమో. శరత్ రచనా శైలి మాత్రం చదివింపచేసేలా వుంది.

మజిలీ  దీదీ - శరత్ - ఇందులో మూడు కథలున్నాయి, మజిలి దీదీ, అణిగిన అహంకారం, కారుచీకటిలో కాంతిరేఖ - మొదటి కథ మజిలి దీదీ నచ్చింది నాకు. తల్లిని తండ్రిని పోగొట్టుకుని అనాధ అయిన కేప్టో సవతి సోదరి అయిన కాదంబిని పంచన చేరతాడు. వారి నిరాదరణకు గురి అయిన కేప్టో ని పక్కనే ఉంటున్న కాదంబిని తోడికోడలయిన హేమాంగిని అక్కున చేర్చుకుంటుంది. ఇది కిట్టని కాదంబిని హేమాంగి తో గొడవకి దిగడం తో రెండు కుటుంబాల మధ్య అంతకు ముందు నుండి వున్న మనస్పర్ధలు హెచ్చుతాయి. చివరకు హేమాంగిని ఇల్లు వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయినా సరే తను నమ్మిన దారిలో నడవడం కోసం భర్తని ఎదిరించి పోరాడి చివరకు కేప్టో ని ఆదరించేందుకు భర్త ని ఒప్పిస్తుంది. ఇక మిగతా రెండు కథలు పెద్దగా నచ్చలేదు. ఈ కథలన్నిటి లోనూ ఆనాటి బెంగాల్ రాష్ట్రం లోని జమిందారి పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతి కళ్ళకు కట్టినట్టు వర్ణించారు రచయిత.

విష వృక్షం - బంకించంద్ర చటర్జీ
- 'వందేమాతరం' రాసిన బంకింబాబు కలం నుండి జారువాలిన నవల ఇది. కుంద అనే ఒక అందమయిన యువతి జీవితం గురించిన కథ ఇది. అనాధ అయిన ఆమెను నాగేంద్రుడు (ఒక జమిందారు) చేరదీస్తాడు. మొదట్లో ఆమె పట్ల కేవలం జాలితో వ్యవహరించిన అతను కొద్ది రోజులకి ఆమెని ప్రేమించడం (ప్రేమించానని అనుకోవడం) మొదలు పెడతాడు. విషయం తెల్సిన అతని భార్య సూర్యముఖి పెద్ద మనసు తో ఇద్దరికీ పెళ్లి జరిపిస్తుంది. తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. కానీ కొద్ది రోజులకే నాగేంద్రుడు తనకు కుంద మీద వున్నది ప్రేమ కాదు అన్న విషయం గుర్తించి భార్య ని వెతుకుతూ తనూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. చివరికి భార్య భర్తలు కలుస్తారు కానీ కుంద ఒంటరి అయిపోతుంది. తర్వాత ఆమె ఏమయింది అనేది ముగింపు. ఈ కథ నాకేమీ నచ్చలేదు.

మొత్తానికి నేను చదివిన మూడు పుస్తకాలు నన్ను కొంచెం నిరాశ పరిచాయనే చెప్పాలి. చాలా దశాబ్దాల క్రితం నాటి రచనలు కాబట్టి నా బుర్ర కి సరిగ్గా ఎక్కలేదేమో మరి. అయినా సరే, ఇంకో మూడు పుస్తకాలున్నాయి (శరత్, బంకింబాబు వి)..అవి కూడా చదివేస్తాను.

జతగాళ్ళు-కతగాళ్ళు - మునిరాజు, సురేష్ రెడ్డి



స్నేహితులయిన ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి ఒకరు చెప్పుకునే కథల సమాహారమే ఈ పుస్తకం. చిన్నప్పుడు బామ్మ, తాతయ్య చెప్పే నీతి కథల్లాంటి కథలున్నాయి ఈ పుస్తకంలో. చాలా కాలం క్రితం చదివిన చందమామ, బాలమిత్ర కథలు జ్ఞాపకం వచ్చాయి ఇవి చదువుతుంటే. చదవడానికి  పిల్లలకి చెప్పే బెడ్ టైం స్టోరీస్ లాగా అనిపించినా వీటిలో వున్న నీతి గురించి తెల్సుకోవడం అందరికీ అవసరమే.

చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు - అమరనారా బసవరాజు (హోసూరు కథలు)



ఎటువంటి కల్పనా లేని వాస్తవిక కథలు ఇవి. రచయిత తనకు ఎదురయిన అనుభవాలు, పల్లెలోని వాతావరణం, ప్రకృతి, అక్కడి మనుషుల నమ్మకాలు వీటి గురించి తనదయిన భాషలో వర్ణిస్తారు. ఈ కథలలో హోసూరు (కర్ణాటక) ప్రాంతం లో ని సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి జీవిత చిత్రాలు అన్నీ ఇమిడి వున్నాయి. వివిధ ప్రాంతాల నేపధ్యాలలో రాయబడిన కథలు ఇష్టపడే వారికి ఈ కథలు బాగా నచ్చుతాయి.

మిథునం - శ్రీ రమణ


శ్రీ రమణ గారు రాసిన ఎనిమిది కథల సంపుటి ఈ పుస్తకం. సున్నితమయిన వ్యంగ్యం, గిలిగింతలుపెట్టే హాస్యం, చక్కని శైలి తో ఇందులోని కథలన్నీ ఆకట్టుకుంటాయి.

ఇందులోని మొదటి కథ 'అరటిపువ్వు సాములారు' నాకు అంతగా నచ్చలేదు, మొత్తం కథల్లో నాకు అంతగా నచ్చని కథల్లో ఇది ఒకటి, మరోటి 'పెళ్లి' అనే కథ. ఈ కథంతా ఒక పెళ్లి లో జరిగే సంభాషణల చుట్టూ తిరుగుతుంది. బోల్డన్ని అంశాల చుట్టూ తిరిగే ఈ సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి.
నచ్చని కథలను వదిలేసి నచ్చిన కథల్లోకి వచ్చేస్తా,

తేనెలో చీమ - కథానాయకుడి జీవితంలోని విషాదానికి కొంచెం వ్యంగ్యం జోడించి రాసిన కథ. పేరు అతికినట్టుగా సరిపోయింది :)


వరహాల బావి - ఒక ఊరిలో వరహాలమ్మ అనే పెద్దావిడ ఇల్లున్న చోట తవ్విన బావి ఊరందరికీ ఎలా దారి చూపిందో, అదే బావి ఊర్లో గొడవలకు ఎలా దారి తీసిందో చాలా చక్కగా వర్ణించిన కథ.

ధనలక్ష్మి - భార్య-భర్తల మధ్య వచ్చే 'ఇగో' సమస్య గురించిన కథ. ధనలక్ష్మి తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేము.

షోడా నాయుడు - షోడా గోలి కోసం షోడా అమ్మే నాయుడి చుట్టూ తిరుగుతూ కథకుడు పడే పాట్లతో నవ్వు తెప్పిస్తూనే గడచిపోయిన మన బాల్యాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది ఈ కథ.

బంగారు మురుగు - ఇది నా alltime ఫేవరెట్ కథ. వేరే కథా సంపుటాల్లో ఈ కథ చదివేసాను. కానీ ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.వెనకటి తరం లోని కుటుంబ వాతావరణం, బామ్మ-మనుమడి అనుబంధం, బామ్మ గారి లౌక్యం, గుణం అన్నీ మనల్ని కట్టిపడేస్తాయి.

మిథునం - ఇది భార్యా-భర్తల మధ్య జరిగే కథ. ప్రతి ఇంట్లోనూ ప్రతి నిత్యం సాగే సరదా గొడవలు, వాటితోనే ఇద్దరి సహజీవనం గురించి ఎంతో చక్కగా వర్ణించారు. ఇందులో తాతగారికి తిండి యావ ఎక్కువ. నాకయితే కథ చదువుతున్నంత సేపు నోట్లో నీళ్లూరుతూనే వున్నాయి ఆ పాత కాలం నాటి వంటలు, అవి వండే విధానం చదువుతూ వుంటే.

పుస్తకం మొత్తం చదివేసాక కమ్మటి తెలుగింటి భోజనం చేసినట్టనిపించింది నాకు :)


Friday, April 20, 2012

విరాట్ - సైఫాన్ త్స్వైక్ - పొనుగోటి కృష్ణారెడ్డి



సైఫాన్ త్స్వైక్ ఆస్ట్రియా లో జన్మించిన ఒక సుప్రసిద్ధ రచయిత. తత్త్వశాస్త్రం అంటే ఎంతో మక్కువ కలిగిన ఆయన భారతీయ గ్రంధాలను, వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలని అధ్యయనం చేసారు. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఇది ఒక విదేశీ రచయిత కలం నుండి వెలువడింది అన్న అభిప్రాయం కలగదు మనకి. 60 - 70  పేజీల ఈ చిన్ని పుస్తకంలో జీవిత పరమార్ధం ఇమిడి వుంది.

విరాట్ అనే పేరుగల ఒక ధీరుడు ఒకానొక రాజ్యంలో ఉంటాడు. అతను తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, సంఘటనల వలన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, దాని వలన అతని జీవిత గమనం ఏ విధంగా మారింది, అతని ఆలోచనా దృక్పదం ఎలా సాగింది, చివరికి అతను అర్ధం చేసుకున్న తత్త్వం ఏమిటి అన్నదే ఈ పుస్తక సారాంశం. అనువాదం కూడా చాలా సరళంగా వుంది చదవడానికి ఎంతో తేలికగా వుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకం నలభై బాషల్లోకి translate చేయబడిందిట.

న్యూ బోంబే టైలర్స్ - ఖదీర్ బాబు



ఖదీర్ రాసిన 'దర్గామిట్ట కథలు, 'పోలేరమ్మ బండ' నాకు చాలా ఇష్టమయిన పుస్తకాలు. ఈ రెండు పుస్తకాలలోని కథల్లో ఖదీర్ తను, తన కుటుంబం, స్నేహితులు, బంధువులు, తను పుట్టి పెరిగిన ఊరయిన కావలి గురించి మనకి పరిచయం చేసారు. వీటిలో అంతర్లీనం గా బోల్డన్ని emotions , సెంటిమెంట్స్ దాగి వుంటాయి. అయితే ఏ కథ చదివినా సరదాగా నవ్వించేలాగానే వుంటుంది .

ఈ 'న్యూ బోంబే టైలర్స్' మాత్రం పైన చెప్పిన రెండు పుస్తకాలకి భిన్నంగా వుంటుంది.

'న్యూ బోంబే టైలర్స్' , 'పెండెం సోడా సెంటర్' కథలు కార్పోరేట్ కంపెనీ లు  చిన్న చిన్న పట్టణాల్లోకి దూసుకుని వచ్చి అక్కడి లోకల్ వ్యాపారస్తులని ఎలా దెబ్బ తీస్తున్నాయో ఆ నేపధ్యం లో వుంటాయి. 'దావత్', 'జమీన్','కింద నేల వుంది','ఖాదర్ లేడు' ,'గెట్ పబ్లిష్డ్' మొదలయిన కథలు కూడా విభిన్న అంశాల నేపధ్యంలో వుంటాయి. కొన్ని కంట తడి పెట్టిస్తే, కొన్ని ఆలోచింపచేసేలా వుంటాయి. మొత్తానికి అన్ని కథలూ బాగున్నాయి. ఇవన్నీ కూడా magazines (ఎక్కువగా సండే ఆంధ్రజ్యోతి) లో వచ్చినవే. అయితే నేను అవేవీ చదవలేదు ఒక్క 'ఖాదర్ లేడు' తప్ప. ఇప్పుడు అన్నీ ఒకే పుస్తకం లోకి తీసుకొచ్చి మంచి పని చేసారు, నాలాంటి వాళ్ళు మిస్ కాకుండా.

పదేళ్ళ క్రితం ఖదీర్ తో నాకు పరిచయం వుండేది. చాలా సరదాగా ఉండేవాడు.అతను ఇంత సీరియస్ కథలు రాస్తాడని అప్పుడు ఊహించనేలేదు. అసలు నేను అతని కథలకి అభిమానినవుతానని అనుకోనేలేదు :)

మరి కొన్ని సినిమాలు..


ఈ మధ్య పూల రంగడు, ఈ రోజుల్లో, Agent వినోద్ చూసాను కానీ వాటి గురించి ఇక్కడ రాయలేదు. అందుకే ఈ పోస్ట్ లో ఒకేసారి లాగించేస్తున్నా :)

పూల రంగడు

అవుట్ n అవుట్ కామెడీ entertainer . సినిమా చూస్తున్నంత సేపూ 'మర్యాద రామన్న' కథలోని shades గుర్తొస్తుంటాయి. పాటలు రెండు మూడు పర్లేదు. సునీల్ ని కామెడీ హీరో గా అయితే చూడగలిగాను కానీ సీరియస్ fight లో, అదీ సిక్స్ ప్యాక్ తో అస్సలు భరించలేకపోయాను. హీరోయిన్ జస్ట్ ఓకే. ఎలాంటి expectations పెట్టుకోకుండా లాజిక్ గురించి ఆలోచించకుండా చూస్తే ఈ సినిమా నచ్చుతుంది.

Agent వినోద్

బాండ్ సినిమాల నుండి inspire అయ్యి తీసిన ఈ మూవీ కూడా జస్ట్ average అనిపించింది నాకు. ఫాస్ట్ paced narration వలన కథ పూర్తిగా అర్ధం కాలేదు నాకు (తర్వాత నెట్ లో చదివాను) హీరో పర్లేదనిపించాడు. హీరో-హీరోయిన్ కి ఆన్-స్క్రీన్ రొమాన్స్ కి అసలు ఛాన్స్ ఇవ్వలేదు కానీ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో బాగా నటించారు.. పాటలు పర్లేదు. Trailer లో కామెడీ సాంగ్ చూసి అలాంటి సినిమానే అనుకుని వెళ్లాను కానీ సీరియస్ మూవీ నే. సైఫ్ ని సీరియస్ రోల్ లో చూడటం బాగుంది. సినిమాలో బోల్డు దేశాలు చుట్టేశారు :) మొత్తానికి ఒక సారి చూడొచ్చు అంతే.

ఈ రోజుల్లో

సినిమాకి మంచి టాక్ రావడం తో మూడో వారం లో వెళ్లాం. నాకు నచ్చింది. కథ లో ఎం కొత్తదనం లేకపోయినా, narration బాగుంది. హీరో పక్కింటి అబ్బాయిలా వున్నాడు. హీరో లక్షణం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు ఇతనిలో. బహుశా అదే ఈ రోల్ లో ఇతనికి ప్లస్ అయి వుంటుంది. హీరోయిన్ కి కొద్దిగా త్రిష పోలికలున్నాయి. తెలుగమ్మాయి అట. చక్కగా వుంది. హీరో-హీరోయిన్ ఇద్దరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. మ్యూజిక్ బాగుంది. "రింగ్ ట్రింగ్" పాట సరదాగా బాగుంది. ఫ్రెష్ ఫీల్ తో వుంది సినిమా అంతా. పెద్ద వాళ్లకి నచ్చకపోవచ్చు కానీ యూత్ కి బాగా నచ్చుతుంది. వాళ్ళని టార్గెట్ చేసుకుని తీసిన సినిమానే ఇది. మూడో వారం లో కూడా collections బాగున్నాయి.

Friday, April 13, 2012

రచ్చ


సినిమా అంటే కేవలం ప్రేక్షకుల entertainment కోసం తీసేది మాత్రమే కాదు వందలాది కుటుంబాలకి అన్నం పెట్టే అన్నపూర్ణ కూడా. కనుక ఇది మాస్ సినిమా, ఇది క్లాసు సినిమా, ఇది అవార్డు సినిమా అని ఎన్ని రకాలుగా విభజించి విమర్శలు చేసినా, పొగిడినా ఆఖరికి ఆ సినిమా వలన లాభాలోచ్చాయా లేదా అన్నదే ముఖ్యమయిపోతుంది. లాభం వస్తే హిట్, లేకపోతే ఫ్లాప్ అంతే. ఆ రకంగా చూస్తే రచ్చ ఖచ్చితమయిన హిట్ సినిమా నే. ఏ వర్గాన్ని అయితే టార్గెట్ చేసుకుని సినిమా తీసారో వాళ్లకి కావాల్సిన అన్ని హంగులూ వున్నాయి. ఈ రెండు వారాల్లో మరో భారీ సినిమా విడుదల లేనందున వసూళ్ళకి ఎలాంటి డోకా వుండదు.

కానీ, నాకు మాత్రం ఈ సినిమా నచ్చలేదు. తలనొప్పి కూడా వచ్చేసింది. రొటీన్ కథ, భారీ సెట్టింగ్స్, నేల విడిచి సాము చేసే హీరో, అతని గురించి కొన్ని భారీ dialogues , రబ్బర్ బొమ్మ లాంటి హీరోయిన్, కథకి వెన్నెముక లాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వెరసి ఒక అవుట్ n అవుట్ మాస్ మసాలా entertainer . చరణ్ నటన బావుంది, అతని వాయిస్ నాకు బాగా నచ్చుతుంది. తమన్నా డాన్సు లు బాగా చేసింది. బదరీనాథ్ సినిమాలోనే చాలా బాగా చేసిందనుకున్నాను. కానీ ఇందులో ఇంకా చక్కగా చేసింది. పాటల్లో టైటిల్ సాంగ్ అన్నిటికంటే బాగా వచ్చింది. Remix సాంగ్ trailers లో చూసినంత బాగాలేదు. అప్పటి బప్పి లహరి మ్యూజిక్ కి తిరుగే లేదు. మిగతా పాటలు సో సో. కామెడీ ఆర్టిస్ట్స్ చాలామందే వున్నారు కానీ ఒక్క బ్రాహ్మి రోల్ మాత్రమే ఆకట్టుకుంటుంది. చరణ్ ఫాన్స్ కి మాత్రం పండగే. మిగతా వాళ్లకి మాత్రం వాళ్ళ వాళ్ళ tolerance లెవెల్స్ ని బట్టి సినిమా నచ్చుతుందా లేదా అనేది ఆధారపడి వుంటుంది :)

Friday, April 6, 2012

3



అదేమిటో నాకు కొన్నాళ్ళ గా తమిళ సినిమాలన్నా, అక్కడి హీరోలన్నా చాలా ఇష్టంగా ఉంటోంది. ఒకప్పుడు సూర్య ని మాత్రమే వెర్రిగా ఆరాధించే నేను ఇప్పుడు ఆర్య, ధనుష్, విక్రం, కార్తి ఎలా ఎవరి సినిమా అన్నా సరే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాను. ధనుష్ సినిమాలు ఇంతకుముందు చూడలేదు కానీ ఇతని గురించి చాలా పత్రికల్లో మంచిగా చదివాను. కొలవెరి పాట కోసం కాదు కానీ ఈ అబ్బాయి సినిమా అనేసరికి '3 ' తప్పకుండా చూడాలనుకున్నాను. శ్రుతి కూడా నచ్చుతుంది నాకు. ఎలాంటి ఓవర్ ఆక్షన్ చేయకుండా చాలా natural గా , ప్రొఫెషనల్ లా నటిస్తుంది.

నన్నెంత మాత్రం నిరాశ పరచలేదు ఈ సినిమా. మొదటి సీన్ లోనే అర్ధమయిపోతుంది ఇది రెగ్యులర్ రొమాంటిక్ లవ్ స్టొరీ కాదు అని. అయితే అదే మూడ్ లో ప్రేక్షకులని ఎక్కువ సేపు ఉంచకుండా ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళిపోతుంది డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా హీరో-హీరోయిన్ మధ్య చిగురించిన teenage ప్రేమ, చిన్న చిన్న అవాంతరాలతో వారి పెళ్లి ఇలాంటి వాటి మధ్య సాగుతుంది. ఇదంతా యూత్ కి తేలిగ్గా connect అవుతుంది. సెకండ్ హాఫ్ నుండి కథలో సీరియస్ ఎలిమెంట్ మొదలవుతుంది. చివరికి వచ్చేసరికి గుండెలు పిండేసే నటన తో ధనుష్ ఒక ఆట ఆడేసుకున్నాడు. హీరో-హీరోయిన్ ఇద్దరూ పోటి పడి నటించినా ఎక్కువ మార్కులు మాత్రం ధనుష్ కే. హీరోయిన్ మీద తనకి ఉన్న ప్రేమ, తనలోని లోపం ఈ రెండిటి మధ్య బాలన్స్ చేసుకోలేక సతమతమయిపోయే ఒక matured క్యారెక్టర్ లో జీవించేసాడు.

పాటల విషయానికొస్తే కొలవెరి పాట స్క్రీన్ మీద ఏమంత గొప్పగా లేదు. ముందుగా లీక్ అవకుండా ఉండి వుంటే బాగుండేదేమో. మిగతా పాటలు బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం సాగ తీత లేకుండా వుంది వుంటే ఇంకా బాగుండేదేమో. మొత్తం మీద కమర్షియల్ గా హిట్ కాకపోవచ్చు కానీ మంచి సినిమా నే. ఒకసారి చూసేయ్యొచ్చు.