Friday, March 16, 2012

డేగ రెక్కల చప్పుడు - యండమూరి వీరేంద్రనాథ్

 

నేను చదివిన పుస్తకాలలో నాకు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకాల్లో యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు చాలా వున్నాయి. ఈయన నవలల్లో నేను మొట్ట మొదట చదివింది "నల్లంచు తెల్ల చీర". అప్పటి నుండి ఆయన నవలల్లో మూడు నాలుగు పుస్తకాలు తప్ప మిగతావి ఏవీ  వదిలిపెట్టకుండా చదివేసాను. దొరికినంత వరకూ కొని దాచుకున్నాను కూడా. ఈయన రాసిన కాసనోవ 99 , తులసి దళం, అష్టా వక్ర లాంటి థ్రిల్లర్స్ తెలుగులో మరే రచయిత ఇంత ఆకట్టుకునేలా రాయలేరేమో అనిపిస్తుంది. ఈయన ఇంగ్లీష్ నవలల నుండి కాపీ చేస్తారని, రచనా స్వేచ్చ ఎక్కువ తీసుకుంటారని అంటారు కానీ నేను ఇంగ్లీష్ నవలలు ఎక్కువ చదవలేదు కాబాట్టి నాకు అలా ఏమీ అనిపించదు. ఈయన రాసిన నవలలు అన్నిటి గురించి ఒక పోస్ట్ రాయాలని అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు.

ఈ నవల "డేగ రెక్కల చప్పుడు" సాక్షి ఆదివారం edition లో సీరియల్ గా వచ్చినప్పుడు నేను కావాలనే చదవలేదు. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏకబిగిన చదివేయ్యాలి నేను. వారం వారం ఎదురు చూడటం నా వల్ల కాని పని. అందుకే నవలగా వచ్చాక చదివాను. ఇంతకు ముందు ఈయన రాసిన "ఒక వర్షాకాలపు సాయంత్రం" అనే నవల లోని కథకి, ఈ నవలలోని కథకీ దగ్గరి పోలికలు వున్నాయి. అయితే రెండూ వేటికవే బాగున్నాయి.

ఈ కథ విషయానికి వస్తే రామకృష్ణ శాస్త్రి భారత సైన్యం లో పని చేసిన ఒక మాజీ ఉద్యోగి. నరనరాన దేశభక్తి ని జీర్ణించుకున్న అసలు సిసలు సిపాయి. తల్లి తండ్రి ని పోగొట్టుకున్న ఇతనికి ఉన్న ఏకైక తోడు ప్రేమించిన అమ్మాయి వైదేహి. అనుకోని పరిస్థితుల్లో అల్-ఖైదా దృష్టి ఇతని మీద పడుతుంది. వాళ్ళకి అవసరమయిన ఒక ఫైల్ కోసం ఇతన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు. ఈ విషయం అతనికి ఆఖరి నిమిషంలో తెలుస్తుంది. వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసి వాళ్లకి సహాయపడతాడు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యని రామకృష్ణ ఎందుకు ఈ పని చేసాడు, అతని అసలు mission  ఏంటి అన్నది అసలు కథాంశం. ఇందులో మొదటి భాగం అంతా ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక, చారిత్రక నేపధ్యం, తాలిబాన్ల ఆవిర్భావం, ఆఫ్ఘనిస్తాన్ లోని గిరిజన తెగల ఆచార వ్యవహారాలూ,రష్యా-అమెరికాల మధ్య నలిగిపోయిన ఆఫ్ఘన్ పౌరుల హక్కుల గురించి వుంటుంది. 

స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఎత్తుగడలనీ, మత చాంధస వాదుల మూర్ఖపు ఆలోచనలనీ, సామన్యుల బ్రతుకులని నేల రాస్తున్న ఉగ్రవాద సంస్థల అరాచకత్వాన్నీ, వాటికి కొమ్ము కాచే దేశాధినేతల కుయుక్తులనీ, సమాజంలో పాతుకు పోయిన స్వార్థాన్ని, కరడు గట్టిన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రచనా స్వేచ్చ ఎక్కువగా తీసుకున్నప్పటికీ నవల మొత్తం చదివాక అవసరమే అనిపిస్తుంది. కొన్ని యథార్థ సంఘటనలు, కొన్ని కల్పితాలు కలగలిపి రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద కలాపాలకు అద్దం పడుతుంది.

No comments:

Post a Comment