Friday, March 23, 2012

Confessions of an Economic Hitman - John Perkins : ఒక దళారీ పశ్చాత్తాపం - కొణతం దిలీప్


మూడేళ్ళ క్రితం HRF వాళ్ళు ముద్రించిన "విస్తాపన-విధ్వంసం" అనే పుస్తకం చదివాను. అందులో అభివృద్ధి పేరిట, సెజ్ ల పేరిట ఆది వాసీలకు, పేద ప్రజలకు, సహజ వనరులకు జరుగుతున్న అన్యాయం గురించి కళ్ళకు కట్టినట్టు రాసారు. నన్ను, నా ఆలోచనలని  ఎంతగానో ప్రభావితం చేసిన పుస్తకాల్లో అది ఒకటి. మన చుట్టూ జరుగుతోన్న (జరుగుతోందని మనం అనుకుంటున్న) అభివృద్ధి అనే నాణేనికి మరో వేపు ఏముందో తెలుస్తుంది ఈ పుస్తకం చదివాక.

ఇప్పుడు ఈ పుస్తకం "ఒక దళారీ పశ్చాత్తాపం" కూడా అదే కోవలోనికి వస్తుంది. HRF వాళ్ళ పుస్తకం మన రాష్ట్రం లో జరుగుతున్న దోపిడీ గురించి రాస్తే, ఈ పుస్తకం లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దోపిడీ గురించి రాసారు. అగ్ర రాజ్యంగా వెలుగుతోన్న అమెరికా చేసిన దురాగతాలను, అభివృద్ధి ముసుగులో మానవాళికి అది చేస్తున్న ద్రోహం గురించి ఈ పుస్తకం లో రాసారు.

ఈ పుస్తక రచయిత జాన్ పెర్కిన్స్ అమెరికా తరపున నియమించబడ్డ ఒక ఎకనామిక్ హిట్ మాన్ (ఇలాంటి ఒక పదం ఉంటుందని ఈ పుస్తకం ద్వారానే తెల్సింది నాకు). చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న వెనుజులా, ఈక్వడార్, ఇరాన్, ఇరాక్, ఇండోనేసియా లాంటి దేశాల్లోని ప్రభుత్వాలని, ప్రజలని అభివృద్ధి పేరిట మభ్యపెట్టి ఆయా దేశాలు ఎప్పటికీ తీర్చలేని రుణాలిచ్చి వారిని తమకి (అమెరికా కి ) బానిసల్లా మార్చే ప్రక్రియ కోసం నియమింపబడ్డ వారే ఈ దళారులు. ఒకప్పుడు అమెరికా లో వుండిన బానిసత్వానికి ఇప్పుడు నాగరీకత, అభివృద్ధి పేరు చెప్పి కొత్త ముసుగు తొడుగుతున్నారు. అమెరికా పాటిస్తున్న రెండు నాల్కల ధోరణిని నగ్నంగా మన ముందు నిలబెడుతుంది ఈ పుస్తకం. గ్లోబల్ సామ్రాజ్య స్థాపన లో భాగంగా కార్పోరేట్ స్వామ్యం పీడిత దేశాలని ఎంత తెలివిగా దోచుకుంటుందో రచయిత ఈ పుస్తకం ద్వారా చెప్పారు. ఈ దోపిడీలో భాగం గా మనం (మానవాళి) కోల్పోయిన సహజ (నదులూ, అడవులు), మానవ వనరులు, సంస్కృతులు, జీవ జాతుల గురించి తెల్సుకుంటూ వుంటే రేపటి తరానికి మనం ఏమి మిగిల్చి ఇస్తున్నాం అన్న ఆలోచన రాక మానదు. దీని గురించి సామాన్య ప్రజలమయిన మనం చేయగలిగినది ఏముంది అన్న ప్రశ్నకి సమాధానం ఏమిటి?

170 పేజీల ఈ పుస్తకం చదవడానికి నాకు రెండు వారాలు పట్టింది. ఇందులో రాసిన ఏ ఒక్క విషయం గురించి నాకు ఇంతకు ముందు ఎలాంటి అవగాహన లేకపోవడమే కారణం. ఇప్పటి వరకూ ప్రపంచం లో ఏ దేశం అయినా కరెన్సీ ని ముద్రించుకోవడానికి అందుకు సరిపడా బంగారు నిలువలనో, లేక వనరులనో చూపించాలని విన్నాను. కానీ అమెరికా అలాంటి రూల్ ఏదీ పాటించకుండా కరెన్సీ ని ముద్రించి ప్రపంచ దేశాలకి అప్పులిస్తుందని ఇందులో చదివి ఆశ్చర్యపోయాను. ఇదేమి న్యాయం. ఎవరూ అడగరా?

తెలుగు అనువాదం చాలా సరళంగా సాగింది. మానవాళి విధ్వంసానికి కారణమయ్యే  ఈ అభివృద్ధి (???) అనే ఊబిలో మనం రోజు రోజుకీ ఎలా కూరుకుపోతున్నామో తెల్సుకోవాలంటే ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.


No comments:

Post a Comment