Monday, July 16, 2012

ఈగ


ఈగ కథ చదవగానే ఈగ ఏంటి, పగ తీర్చుకోడం ఏంటి అనుకున్నాను...అయితే డైరెక్టర్ రాజమౌళి కాబట్టి చూసి తీరాల్సిన సినిమా అనుకున్నాను..అతను కాకుండా వేరే డైరెక్టర్ అయి వుండి, ఈ కథ ముందే తెలిస్తే చూసేదాన్ని కాదేమో..

సినిమా అవుట్ n అవుట్ entertainer ...ఎక్కడా బోర్ కొట్టలేదు..లిమిటెడ్ characters తో, అనవసరమయిన సీన్ ఒక్కటి కూడా లేకుండా సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది..ఈగ హావభావాలు, డాన్సు లు చెయ్యడం ఇవన్నీ చాలా ఆకట్టుకుంటాయి..నటీనటుల విషయానికొస్తే ఉన్న నాలుగు (నాని, సమంత,సుదీప్, ఈగ) ముఖ్య పాత్రల్లో బాగా నచ్చింది సుదీప్ నటన..నటించలేదు, జీవించేసాడు అనాలేమో..నాని వున్నది కొద్ది సేపే అయినా కూడా బాగా చేసాడు..అతను చనిపోగానే అప్పుడే అయిపోయిందా ఇతని రోల్ అనిపించి బాధేస్తుంది..కానీ వెంటనే ఈగ లా పుట్టడం తో మళ్ళీ సినిమా లో లీనమయిపోతాము..ఈగ కి dialogues పెట్టకుండా మంచి పని చేసారు..అవి వుంటే సినిమా మరోలా వుండేది, ఈగ హీరో అయ్యేది కాదేమో...ఈగ ని ఈగ లానే చూపించడం బాగుంది..సమంత కూడా బావుంది...చివర్లో ఈగ మీద చేసిన టైటిల్ సాంగ్ భలే నచ్చేసింది నాకు..



ఈ సినిమా కథ చెప్పేటప్పుడు నాని ఈగ రూపం లో పుట్టి సుదీప్ మీద పగ తీర్చుకుంటాడు అని అనడం విన్నాను కానీ సినిమా చూసాక ఈగ పగ తీర్చుకుంది అనడం కంటే తన ప్రేయసి ని విలన్ బారి నుండి కాపాడుకుంది అనడం కరెక్ట్ అనిపించింది నాకు.

రాజమౌళి ఏదో ఒక జిమ్మిక్ చేసి సినిమా ని హిట్ చేసేస్తాడు అన్న మాట మరో సారి prove అయింది..theatre లో మాత్రమే చూడాల్సిన సినిమా ఇది...

Tuesday, May 22, 2012

గబ్బర్ సింగ్


పవన్ కళ్యాణ్ సినిమాల్లో వుండే కామెడీ, melodious మ్యూజిక్ నాకు చాలా నచ్చుతాయి. ముఖ్యంగా ద్వందార్ధాలు ఉపయోగించకుండా రాసే పాటలు మరీ మరీ ఇష్టం. ఈ సినిమా హిట్ అవాలని చాలా చాలా కోరుకున్నాను..పవన్ కళ్యాణ్ అంటే ఏదో మూల ఇష్టం వుంది నాకు, పైగా శ్రుతి హసన్ కూడా ఇష్టమే నాకు..అందుకే ఈ సినిమా కోసం చాలా ఎదురుచూసాను. రిలీజ్ అయిన రోజే ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది అని చెప్పగానే సంతోషించాను. కానీ మొదటి వారం టికెట్స్ దొరకలేదు. పోయిన శనివారం వెళ్లి చూసొచ్చాను. Reviews చదవక పోయినా కొంచెం ఎక్కువ expectations పెట్టుకునే వెళ్లాను. సినిమా చాలా బాగుంది అని చెప్పలేను కానీ నాకు నచ్చింది. హిందీ సినిమా దబాంగ్ నుండి remake చేసినా ఎక్కడా ఆ ఫీలింగ్ రానివ్వలేదు..నేను దబాంగ్ చూసినా కూడా నాకు అలా అనిపించలేదంటే డైరెక్ట్ గా తెలుగు సినిమా చూసిన వాళ్లకి అయితే ఇక ఇది straight సినిమానే అనిపిస్తుందేమో. కథలో చాలానే మార్పులు చేసారు. లాజిక్ ని పక్కన పెడితే బాగా ఎంజాయ్ చేయొచ్చు.

తిక్క పోలీసు ఆఫీసర్ రోల్ పవన్ కళ్యాణ్ తను తప్ప వేరెవరూ చేయలేరు అన్నంత బాగా చేసాడు. ఈ సినిమా అంతా కూడా హీరో attitude చుట్టూనే తిరుగుతుంది. PK energy అంతా కనిపిస్తుంది ప్రతి సన్నివేశంలో (పంజా లో ఇది టోటల్ గా మిస్సింగ్).శ్రీకాకుళం యాస లో పలికే dialogues అయితే భలే బాగున్నాయి (పదేళ్ళ క్రితం వచ్చిన ఖుషి ని గుర్తుచేశాయి). శ్రుతి decent గా వుంది. ఆ అమ్మాయి పక్కన గాయత్రి (హ్యాపీ డేస్ లో అప్పు) చేసిన ఓవర్ ఆక్షన్ మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా వుంది. అలీ, బ్రాహ్మి ఇద్దరూ ఓకే. మిగతా అందరూ వాళ్ళ వాళ్ళ roles కి తగ్గట్టు బాగానే చేసారు. టైటిల్ ఏదో catchy గా వుండాలని పెట్టినట్టు కాకుండా హీరో కి ఆ క్యారెక్టర్ పట్ల వున్న craze ని వీలయినన్ని సన్నివేశాల్లో చూపించి టైటిల్ కి న్యాయం చేసారు. సెకండ్ హాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీన్ కొంచెం ఓవర్ గా వున్నా కూడా సెన్స్ లెస్ కామెడీ ని ఎంజాయ్ చేయగలిగాను.

మ్యూజిక్ అయితే కెవ్వు కేక. పాటలన్నీ నచ్చాయి. నేను ముందుగా వినలేదు కూడా.మొదటి సారి స్క్రీన్ మీద చూస్తూ వినడమే. టైటిల్ సాంగ్, ఆకాశం అమ్మాయి అయితే, దిల్ సే పాటలు చాలా బాగున్నాయి. ఐటెం సాంగ్ మాత్రం కొంచెం ఎక్కువ ఊహించుకున్ననేమో నాకంతగా నచ్చలేదు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగే. మిగతా వాళ్ళు కూడా ఒక్క సారి హ్యాపీ గా చూడగలరు.

Saturday, May 12, 2012

దమ్ము

ఈ సినిమా చూడటమే ఒక వేస్ట్, ఇక దాని గురించి రాయటం పరమ దండగ. లాజిక్ లేని కథ, నేల విడిచి సాము చేసే హీరో,అతని చుట్టూ తిరుగుతూ వెకిలి వేషాలేసే హీరోయిన్ లు, రక్త పాతం, చీప్ కామెడీ, భారీ సెట్టింగ్స్ వెరసి ఈ సినిమా. నాకు తెలుగు హీరోల పాట్లు చూస్తుంటే జాలేస్తుంది. నిజంగా వాళ్ళు ఇలాంటి సినిమాలు ఇష్టపడే చేస్తున్నారా అనిపిస్తుంది. Jr NTR  మంచి నటుడు దాంట్లో తిరుగు లేదు. డాన్సులు, కామెడీ తో సహా నవరసాలు బాగా పండించగలడు. జనం అతన్ని ఇలాంటి మాస్ రోల్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటివే చేయక తప్పదు :( నా లాంటి సినిమా పిచ్చోళ్ళు వేరే గతి లేక చూడకా తప్పదు.

పండు గాడిని మాత్రం ఇక ఇలాంటి సినిమాలకి తీసుకేళ్ళకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడయితే వాడు theatre లోకి వెళ్ళగానే నిద్రపోతున్నాడు. కానీ కొంచెం ఊహ తెలిసాక చూడటం మొదలు పెడితే కష్టం కదా. అందుకే ముందు వాడిని తీసుకెళ్ళడం మానేసి మెల్లగా నేను కూడా ఇలాంటి సినిమాలకి వెళ్ళడం మానుకోవాలి.

Saturday, April 28, 2012

Housefull - 2


హిందీ సినిమాల్లో ఈ మధ్య కామెడీ వి బాగా హిట్ అవుతున్నాయి కానీ నేను మాత్రం ఎందుకో ధైర్యం చేయలేకపోయాను ఇన్ని రోజులూ అలాంటి సినిమాలు చూడటానికి. అప్పుడెప్పుడో 'రెడీ' చూసాను, అదేమో నాకు నచ్చలేదు. అందుకే ఈ సారి ఎలాంటి expectations పెట్టుకోకుండా వెళ్లాను ఈ సినిమాకి.

సూపర్ అని చెప్పలేను కానీ బాగుంది సినిమా. వల్గర్, చీప్ కామెడీ లేకుండా హాయిగా మనసారా నవ్వుకునే హాస్యం వుంది సినిమా అంతా. కథ తెలుగు లో వచ్చిన 'హంగామా' సినిమా ని పోలి వుంది (ఆ సినిమా నేను మొత్తం చూడలేదు కానీ టీవీ లో వచ్చే ముక్కలు చూశాను). లాజిక్ ని పక్కన పెట్టి నలుగురి జంటల మధ్య వచ్చే confusion వలన పుట్టిన కామెడీ ని ఎంజాయ్ చేసి రావొచ్చు . నటీ నటులందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు బాగా చేసారు. పాటలు రెండు బాగున్నాయి, మిగతా రెండు పర్లేదనిపించాయి.

లవ్లీ



రొటీన్ ప్రేమ కథా చిత్రమే ఇది. కాన్సెప్ట్ లో కొత్తదనం లేకపోయినా ఫస్ట్ హాఫ్ ఆహ్లాదంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ వేసే వేషాలు కొంచెం విసుగు తెప్పిస్తాయి. ఆది పెర్ఫార్మన్స్ బాగుంది. డాన్సు లు బాగా చేస్తున్నాడు, చూడటానికి చక్కగా వున్నాడు. అయితే డైలాగ్ డెలివరీ లో మాత్రం ఇంకొంచెం కష్టపడాలి. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకోవాలంటే తప్పదు మరి . లవర్ బాయ్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోతాడు. హీరోయిన్ నాకు నచ్చలేదు. వెన్నెల కిషోర్ రోల్ బాగా పండింది.

మరీ బోర్ కొడుతుంటే వెళ్లి చూడొచ్చు ఈ సినిమాని. మాకు పోయిన ఆదివారం చూడటానికి ఇంకేమీ సినిమాలు మిగలక దీనికి వెళ్లాం :)

The Mighty and Mystical Rivers of India - Alaka Sankar


ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదం చదివాను నేను. భారతదేశం లోని వివిధ నదులు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, పురాణాల్లో వాటి ప్రాశస్త్యం, వాటి పరీవాహక ప్రాంతాలు, అక్కడి పుణ్యక్షేత్రాలు, సంస్కృతులు, సంప్రదాయాలు మొదలయిన విశేషాల సమాహారం ఈ పుస్తకం. మనకి ఎంతో పవిత్రమయిన గంగ, యమున, గోదావరి, కృష్ణ లాంటి నదుల చరిత్ర, వాటి ఔన్నత్యం తెల్సుకోవడం ఎంతో బాగుంది.

ఈ పుస్తకం ద్వారా మొత్తం భారతదేశం అంతటా ప్రవహించే నదుల గురించి చదవడం వలన అవి ప్రవహించే అన్ని ప్రాంతాల గురించి కూడా ఎన్నో ఆసక్తికరమయిన విషయాలను చదివి తెల్సుకోవచ్చు. అంతా చదివాక నాకు ఉత్తర భారత దేశ యాత్ర చేయాలన్న కోరిక ఇంకా ఎక్కువయ్యింది :) ఎప్పటికి తీరుతుందో మరి?

బెంగాలి నవలలు, కథలు - 1



దేవదాసు - శరత్ - ఈ కథ అందరికీ తెలిసిందే. పాతదో, కొత్తదో 'దేవదాసు' సినిమా చూడని వాళ్ళు వుండరేమో. అయితే ఈ సినిమా కి మూలమయిన నవల ఎలా వుంటుందో చదవాలన్న కోరిక నాకెప్పటి నుండో ఉండింది. నవల చదువుతున్నంత సేపు ఈ మధ్యే చూసిన హిందీ 'దేవదాసు' గుర్తొస్తూనే వుంది. సినిమాకి, నవల కి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఇప్పటి తరం వాళ్లకి ఆనాటి రచన చదవడం కంటే సినిమా చూస్తేనే నచ్చుతుందేమో. శరత్ రచనా శైలి మాత్రం చదివింపచేసేలా వుంది.

మజిలీ  దీదీ - శరత్ - ఇందులో మూడు కథలున్నాయి, మజిలి దీదీ, అణిగిన అహంకారం, కారుచీకటిలో కాంతిరేఖ - మొదటి కథ మజిలి దీదీ నచ్చింది నాకు. తల్లిని తండ్రిని పోగొట్టుకుని అనాధ అయిన కేప్టో సవతి సోదరి అయిన కాదంబిని పంచన చేరతాడు. వారి నిరాదరణకు గురి అయిన కేప్టో ని పక్కనే ఉంటున్న కాదంబిని తోడికోడలయిన హేమాంగిని అక్కున చేర్చుకుంటుంది. ఇది కిట్టని కాదంబిని హేమాంగి తో గొడవకి దిగడం తో రెండు కుటుంబాల మధ్య అంతకు ముందు నుండి వున్న మనస్పర్ధలు హెచ్చుతాయి. చివరకు హేమాంగిని ఇల్లు వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయినా సరే తను నమ్మిన దారిలో నడవడం కోసం భర్తని ఎదిరించి పోరాడి చివరకు కేప్టో ని ఆదరించేందుకు భర్త ని ఒప్పిస్తుంది. ఇక మిగతా రెండు కథలు పెద్దగా నచ్చలేదు. ఈ కథలన్నిటి లోనూ ఆనాటి బెంగాల్ రాష్ట్రం లోని జమిందారి పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతి కళ్ళకు కట్టినట్టు వర్ణించారు రచయిత.

విష వృక్షం - బంకించంద్ర చటర్జీ
- 'వందేమాతరం' రాసిన బంకింబాబు కలం నుండి జారువాలిన నవల ఇది. కుంద అనే ఒక అందమయిన యువతి జీవితం గురించిన కథ ఇది. అనాధ అయిన ఆమెను నాగేంద్రుడు (ఒక జమిందారు) చేరదీస్తాడు. మొదట్లో ఆమె పట్ల కేవలం జాలితో వ్యవహరించిన అతను కొద్ది రోజులకి ఆమెని ప్రేమించడం (ప్రేమించానని అనుకోవడం) మొదలు పెడతాడు. విషయం తెల్సిన అతని భార్య సూర్యముఖి పెద్ద మనసు తో ఇద్దరికీ పెళ్లి జరిపిస్తుంది. తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. కానీ కొద్ది రోజులకే నాగేంద్రుడు తనకు కుంద మీద వున్నది ప్రేమ కాదు అన్న విషయం గుర్తించి భార్య ని వెతుకుతూ తనూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. చివరికి భార్య భర్తలు కలుస్తారు కానీ కుంద ఒంటరి అయిపోతుంది. తర్వాత ఆమె ఏమయింది అనేది ముగింపు. ఈ కథ నాకేమీ నచ్చలేదు.

మొత్తానికి నేను చదివిన మూడు పుస్తకాలు నన్ను కొంచెం నిరాశ పరిచాయనే చెప్పాలి. చాలా దశాబ్దాల క్రితం నాటి రచనలు కాబట్టి నా బుర్ర కి సరిగ్గా ఎక్కలేదేమో మరి. అయినా సరే, ఇంకో మూడు పుస్తకాలున్నాయి (శరత్, బంకింబాబు వి)..అవి కూడా చదివేస్తాను.

జతగాళ్ళు-కతగాళ్ళు - మునిరాజు, సురేష్ రెడ్డి



స్నేహితులయిన ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి ఒకరు చెప్పుకునే కథల సమాహారమే ఈ పుస్తకం. చిన్నప్పుడు బామ్మ, తాతయ్య చెప్పే నీతి కథల్లాంటి కథలున్నాయి ఈ పుస్తకంలో. చాలా కాలం క్రితం చదివిన చందమామ, బాలమిత్ర కథలు జ్ఞాపకం వచ్చాయి ఇవి చదువుతుంటే. చదవడానికి  పిల్లలకి చెప్పే బెడ్ టైం స్టోరీస్ లాగా అనిపించినా వీటిలో వున్న నీతి గురించి తెల్సుకోవడం అందరికీ అవసరమే.

చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు - అమరనారా బసవరాజు (హోసూరు కథలు)



ఎటువంటి కల్పనా లేని వాస్తవిక కథలు ఇవి. రచయిత తనకు ఎదురయిన అనుభవాలు, పల్లెలోని వాతావరణం, ప్రకృతి, అక్కడి మనుషుల నమ్మకాలు వీటి గురించి తనదయిన భాషలో వర్ణిస్తారు. ఈ కథలలో హోసూరు (కర్ణాటక) ప్రాంతం లో ని సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి జీవిత చిత్రాలు అన్నీ ఇమిడి వున్నాయి. వివిధ ప్రాంతాల నేపధ్యాలలో రాయబడిన కథలు ఇష్టపడే వారికి ఈ కథలు బాగా నచ్చుతాయి.

మిథునం - శ్రీ రమణ


శ్రీ రమణ గారు రాసిన ఎనిమిది కథల సంపుటి ఈ పుస్తకం. సున్నితమయిన వ్యంగ్యం, గిలిగింతలుపెట్టే హాస్యం, చక్కని శైలి తో ఇందులోని కథలన్నీ ఆకట్టుకుంటాయి.

ఇందులోని మొదటి కథ 'అరటిపువ్వు సాములారు' నాకు అంతగా నచ్చలేదు, మొత్తం కథల్లో నాకు అంతగా నచ్చని కథల్లో ఇది ఒకటి, మరోటి 'పెళ్లి' అనే కథ. ఈ కథంతా ఒక పెళ్లి లో జరిగే సంభాషణల చుట్టూ తిరుగుతుంది. బోల్డన్ని అంశాల చుట్టూ తిరిగే ఈ సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి.
నచ్చని కథలను వదిలేసి నచ్చిన కథల్లోకి వచ్చేస్తా,

తేనెలో చీమ - కథానాయకుడి జీవితంలోని విషాదానికి కొంచెం వ్యంగ్యం జోడించి రాసిన కథ. పేరు అతికినట్టుగా సరిపోయింది :)


వరహాల బావి - ఒక ఊరిలో వరహాలమ్మ అనే పెద్దావిడ ఇల్లున్న చోట తవ్విన బావి ఊరందరికీ ఎలా దారి చూపిందో, అదే బావి ఊర్లో గొడవలకు ఎలా దారి తీసిందో చాలా చక్కగా వర్ణించిన కథ.

ధనలక్ష్మి - భార్య-భర్తల మధ్య వచ్చే 'ఇగో' సమస్య గురించిన కథ. ధనలక్ష్మి తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేము.

షోడా నాయుడు - షోడా గోలి కోసం షోడా అమ్మే నాయుడి చుట్టూ తిరుగుతూ కథకుడు పడే పాట్లతో నవ్వు తెప్పిస్తూనే గడచిపోయిన మన బాల్యాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది ఈ కథ.

బంగారు మురుగు - ఇది నా alltime ఫేవరెట్ కథ. వేరే కథా సంపుటాల్లో ఈ కథ చదివేసాను. కానీ ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.వెనకటి తరం లోని కుటుంబ వాతావరణం, బామ్మ-మనుమడి అనుబంధం, బామ్మ గారి లౌక్యం, గుణం అన్నీ మనల్ని కట్టిపడేస్తాయి.

మిథునం - ఇది భార్యా-భర్తల మధ్య జరిగే కథ. ప్రతి ఇంట్లోనూ ప్రతి నిత్యం సాగే సరదా గొడవలు, వాటితోనే ఇద్దరి సహజీవనం గురించి ఎంతో చక్కగా వర్ణించారు. ఇందులో తాతగారికి తిండి యావ ఎక్కువ. నాకయితే కథ చదువుతున్నంత సేపు నోట్లో నీళ్లూరుతూనే వున్నాయి ఆ పాత కాలం నాటి వంటలు, అవి వండే విధానం చదువుతూ వుంటే.

పుస్తకం మొత్తం చదివేసాక కమ్మటి తెలుగింటి భోజనం చేసినట్టనిపించింది నాకు :)