Saturday, April 28, 2012

బెంగాలి నవలలు, కథలు - 1



దేవదాసు - శరత్ - ఈ కథ అందరికీ తెలిసిందే. పాతదో, కొత్తదో 'దేవదాసు' సినిమా చూడని వాళ్ళు వుండరేమో. అయితే ఈ సినిమా కి మూలమయిన నవల ఎలా వుంటుందో చదవాలన్న కోరిక నాకెప్పటి నుండో ఉండింది. నవల చదువుతున్నంత సేపు ఈ మధ్యే చూసిన హిందీ 'దేవదాసు' గుర్తొస్తూనే వుంది. సినిమాకి, నవల కి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఇప్పటి తరం వాళ్లకి ఆనాటి రచన చదవడం కంటే సినిమా చూస్తేనే నచ్చుతుందేమో. శరత్ రచనా శైలి మాత్రం చదివింపచేసేలా వుంది.

మజిలీ  దీదీ - శరత్ - ఇందులో మూడు కథలున్నాయి, మజిలి దీదీ, అణిగిన అహంకారం, కారుచీకటిలో కాంతిరేఖ - మొదటి కథ మజిలి దీదీ నచ్చింది నాకు. తల్లిని తండ్రిని పోగొట్టుకుని అనాధ అయిన కేప్టో సవతి సోదరి అయిన కాదంబిని పంచన చేరతాడు. వారి నిరాదరణకు గురి అయిన కేప్టో ని పక్కనే ఉంటున్న కాదంబిని తోడికోడలయిన హేమాంగిని అక్కున చేర్చుకుంటుంది. ఇది కిట్టని కాదంబిని హేమాంగి తో గొడవకి దిగడం తో రెండు కుటుంబాల మధ్య అంతకు ముందు నుండి వున్న మనస్పర్ధలు హెచ్చుతాయి. చివరకు హేమాంగిని ఇల్లు వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయినా సరే తను నమ్మిన దారిలో నడవడం కోసం భర్తని ఎదిరించి పోరాడి చివరకు కేప్టో ని ఆదరించేందుకు భర్త ని ఒప్పిస్తుంది. ఇక మిగతా రెండు కథలు పెద్దగా నచ్చలేదు. ఈ కథలన్నిటి లోనూ ఆనాటి బెంగాల్ రాష్ట్రం లోని జమిందారి పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతి కళ్ళకు కట్టినట్టు వర్ణించారు రచయిత.

విష వృక్షం - బంకించంద్ర చటర్జీ
- 'వందేమాతరం' రాసిన బంకింబాబు కలం నుండి జారువాలిన నవల ఇది. కుంద అనే ఒక అందమయిన యువతి జీవితం గురించిన కథ ఇది. అనాధ అయిన ఆమెను నాగేంద్రుడు (ఒక జమిందారు) చేరదీస్తాడు. మొదట్లో ఆమె పట్ల కేవలం జాలితో వ్యవహరించిన అతను కొద్ది రోజులకి ఆమెని ప్రేమించడం (ప్రేమించానని అనుకోవడం) మొదలు పెడతాడు. విషయం తెల్సిన అతని భార్య సూర్యముఖి పెద్ద మనసు తో ఇద్దరికీ పెళ్లి జరిపిస్తుంది. తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. కానీ కొద్ది రోజులకే నాగేంద్రుడు తనకు కుంద మీద వున్నది ప్రేమ కాదు అన్న విషయం గుర్తించి భార్య ని వెతుకుతూ తనూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. చివరికి భార్య భర్తలు కలుస్తారు కానీ కుంద ఒంటరి అయిపోతుంది. తర్వాత ఆమె ఏమయింది అనేది ముగింపు. ఈ కథ నాకేమీ నచ్చలేదు.

మొత్తానికి నేను చదివిన మూడు పుస్తకాలు నన్ను కొంచెం నిరాశ పరిచాయనే చెప్పాలి. చాలా దశాబ్దాల క్రితం నాటి రచనలు కాబట్టి నా బుర్ర కి సరిగ్గా ఎక్కలేదేమో మరి. అయినా సరే, ఇంకో మూడు పుస్తకాలున్నాయి (శరత్, బంకింబాబు వి)..అవి కూడా చదివేస్తాను.

No comments:

Post a Comment