నేను ఈ పుస్తకం చదవాలనుకోవడానికి కారణం దీనికి ముళ్ళపూడి వెంకటరమణ గారు, నండూరి రామమోహనరావు గారు రాసిన పరిచయ వాఖ్యలు :) గడిచిన కాలం లో ఈ రచయత రాసినవి ఈ తొమ్మిది కథలే అయినా టాప్ టెన్ రచయతల్లో రామచంద్రరావు గారిని ఒకరిగా చాసో గారు వర్ణించారు అంటే తప్పకుండా ఇవి బాగుండి వుంటాయి అని చదవడం మొదలుపెట్టాను. ఇందులోని కథలన్నీ అరవై-డెబ్బై ఏళ్ళ క్రిందట రాసినవి.రచయిత అప్పట్లో కర్నాటక/తమిళనాడు లోని ఒక టీ-ఎస్టేట్ లో ఉన్నతాధికారిగా పని చేసారు, మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా.
ఈ సంపుటి లో తొమ్మిది కథలున్నాయి. అన్నిటిలో ఏది నచ్చింది అని అడిగితే చెప్పడం కష్టమే. వేటికవే ప్రత్యేకమయినవిగా తోచాయి. ఎక్కువ కథలకు నేపధ్యం టీ-ఎస్టేట్ లోని జీవితమే. స్త్రీ-పురుషల సంబంధాలు, భార్య-భర్తల అనుబంధాలు, యజమాని-నౌకరు సంబంధాలు, సహోద్యోగుల మధ్య వుండే వాతావరణం, మనిషికి-జంతువుకి మధ్య వుండే సున్నితమయిన సెంటిమెంట్స్ ఇలా మానవ సంబంధాలలో వున్న అనేకానేక కోణాలను స్పృశిస్తూ రాసిన కథలు ఇవన్నీను. ఒక్కో కథ రాయడం కోసం రచయిత చేసిన పరిశీలన మెచ్చుకోదగినది. ముఖ్యంగా 'ఏనుగులరాయి' కథలో ఏనుగుల మనస్తత్వాన్నీ, కడకరైకీ-ఏనుగులకీ మధ్య వుండే అనుబంధాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఎంతో పరిశీలనా దృష్టి వుంటే కానీ ఇది సాధ్యపడదు. కథల్లోని పాత్రలన్నీ సజీవంగా, వాస్తవికంగా వున్నాయి.
ఈ కథల్లోని పాత్రదారులు ఎక్కువ మంది తమిళ తంబిలు, ఇంకా తెల్ల దొరలూ. అయినా స్వచ్ఛమయిన తెలుగు కథలు చదువుతున్నట్టే అనిపించింది. తెలుగు కథ రాయడానికి ప్రాత్రధారులు, నేపధ్య వాతావరణం తెలుగు మాత్రమే కానవసరం లేదు అని అనిపిస్తుంది ఈ పుస్తకం చదివాక. పడమటి కనుమల మధ్య, పచ్చటి టీ-కాఫీ తోటల్లో విహరిస్తూ స్వచ్ఛమయిన గాలి పీలుస్తూ మంచి కాఫీ తాగుతున్న ఫీలింగ్ వచ్చింది ఈ కథలు చదువుతుంటే.
No comments:
Post a Comment