Friday, February 17, 2012

ఒక హిజ్రా కథ - పరవస్తు లోకేశ్వర్



ఉర్దూ, హిందీ భాషలలోని 8 కథలను పరవస్తు లోకేశ్వర్ గారు అనువదించి ఈ పుస్తక రూపం లో అందించారు. ఇందులో మూడు కథలు కుష్వంత్ సింగ్ రాసినవి కాగా మిగతా అయిదూ వేరు వేరు రచయితలు రాసినవి. కుష్వంత్ సింగ్ రాసిన మూడు కథలూ 17 - 18 శతాబ్దాలలో మొఘల్ సామ్రాజ్యం మరియూ సిపాయి తిరుగుబాటు ల నేపధ్యాలలో రాసినవి. చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కేవలం చరిత్ర పుస్తకాలు చదివితే సరిపోదు. ఎందుకంటే అందులో రాజులు, వాళ్ళ పాలనా విధానాలు, జరిగిన యుద్ధాలు, ఆస్తుల లెక్కలు, రాజకీయ ఒప్పందాలు, తారీఖులు ఇవి మాత్రమే వుంటాయి. అప్పటి కాలంలో ప్రజల మనోభావాలు, సంఘర్షణలు కూడా చరిత్రలో భాగమే. ఇవి దాదాపుగా ఏ చరిత్ర పుస్తకంలోనూ కనిపించవు. ఇవి తెల్సుకోవాలంటే అప్పటి కాలం లో జీవించిన సామాన్యుల కథలు చదవాలి. ఈ మూడు కథల లోనూ  అప్పటి ప్రజల జీవన విధానాలు, ఆలోచనలు, యుద్ధాల వలన వాళ్ళ జీవితాల్లో వచ్చిన పెను మార్పులూ అన్నీ చక్కగా వర్ణించబడ్డాయి.

ఇక మిగతా కథలలో నాకు మొదటి కథ 'గృహ నిర్మాత' , రెండవ కథ ' పరువు-ప్రతిష్ట' బాగా నచ్చాయి. మొదటి కథలో వేశ్య అయిన లాజ్వంతి వివాహం ద్వారా స్వేచ్ఛను కోల్పోతే (సమాజం లో ఒక గౌరవమయిన స్థానం పొందినప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతుంది), రెండవ కథలో పటాన్ల అమ్మాయి స్వేచ్ఛగా జీవించగలిగి ఉండి కూడా  మనసిచ్చిన వాడి కోసం, కుటుంబ పరువు కోసం వివాహం మాట తలపెట్టకుండా తనకు తానే సంకెళ్ళు వేసుకుని జీవితమంతా గడిపేస్తుంది. విభిన్న పరిస్థితులలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళ సంఘర్షణకి ఈ రెండు కథలూ అద్దం పడతాయి. ఇక అనుకోని పరిస్థితులలో హిజ్రాగా మారిన మైనా కథ కంట తడి పెట్టిస్తుంది.

భాష కూడా సరళంగా ఉండి చదవడానికి తేలికగానే ఉంది.

No comments:

Post a Comment