Friday, March 23, 2012

Confessions of an Economic Hitman - John Perkins : ఒక దళారీ పశ్చాత్తాపం - కొణతం దిలీప్


మూడేళ్ళ క్రితం HRF వాళ్ళు ముద్రించిన "విస్తాపన-విధ్వంసం" అనే పుస్తకం చదివాను. అందులో అభివృద్ధి పేరిట, సెజ్ ల పేరిట ఆది వాసీలకు, పేద ప్రజలకు, సహజ వనరులకు జరుగుతున్న అన్యాయం గురించి కళ్ళకు కట్టినట్టు రాసారు. నన్ను, నా ఆలోచనలని  ఎంతగానో ప్రభావితం చేసిన పుస్తకాల్లో అది ఒకటి. మన చుట్టూ జరుగుతోన్న (జరుగుతోందని మనం అనుకుంటున్న) అభివృద్ధి అనే నాణేనికి మరో వేపు ఏముందో తెలుస్తుంది ఈ పుస్తకం చదివాక.

ఇప్పుడు ఈ పుస్తకం "ఒక దళారీ పశ్చాత్తాపం" కూడా అదే కోవలోనికి వస్తుంది. HRF వాళ్ళ పుస్తకం మన రాష్ట్రం లో జరుగుతున్న దోపిడీ గురించి రాస్తే, ఈ పుస్తకం లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దోపిడీ గురించి రాసారు. అగ్ర రాజ్యంగా వెలుగుతోన్న అమెరికా చేసిన దురాగతాలను, అభివృద్ధి ముసుగులో మానవాళికి అది చేస్తున్న ద్రోహం గురించి ఈ పుస్తకం లో రాసారు.

ఈ పుస్తక రచయిత జాన్ పెర్కిన్స్ అమెరికా తరపున నియమించబడ్డ ఒక ఎకనామిక్ హిట్ మాన్ (ఇలాంటి ఒక పదం ఉంటుందని ఈ పుస్తకం ద్వారానే తెల్సింది నాకు). చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న వెనుజులా, ఈక్వడార్, ఇరాన్, ఇరాక్, ఇండోనేసియా లాంటి దేశాల్లోని ప్రభుత్వాలని, ప్రజలని అభివృద్ధి పేరిట మభ్యపెట్టి ఆయా దేశాలు ఎప్పటికీ తీర్చలేని రుణాలిచ్చి వారిని తమకి (అమెరికా కి ) బానిసల్లా మార్చే ప్రక్రియ కోసం నియమింపబడ్డ వారే ఈ దళారులు. ఒకప్పుడు అమెరికా లో వుండిన బానిసత్వానికి ఇప్పుడు నాగరీకత, అభివృద్ధి పేరు చెప్పి కొత్త ముసుగు తొడుగుతున్నారు. అమెరికా పాటిస్తున్న రెండు నాల్కల ధోరణిని నగ్నంగా మన ముందు నిలబెడుతుంది ఈ పుస్తకం. గ్లోబల్ సామ్రాజ్య స్థాపన లో భాగంగా కార్పోరేట్ స్వామ్యం పీడిత దేశాలని ఎంత తెలివిగా దోచుకుంటుందో రచయిత ఈ పుస్తకం ద్వారా చెప్పారు. ఈ దోపిడీలో భాగం గా మనం (మానవాళి) కోల్పోయిన సహజ (నదులూ, అడవులు), మానవ వనరులు, సంస్కృతులు, జీవ జాతుల గురించి తెల్సుకుంటూ వుంటే రేపటి తరానికి మనం ఏమి మిగిల్చి ఇస్తున్నాం అన్న ఆలోచన రాక మానదు. దీని గురించి సామాన్య ప్రజలమయిన మనం చేయగలిగినది ఏముంది అన్న ప్రశ్నకి సమాధానం ఏమిటి?

170 పేజీల ఈ పుస్తకం చదవడానికి నాకు రెండు వారాలు పట్టింది. ఇందులో రాసిన ఏ ఒక్క విషయం గురించి నాకు ఇంతకు ముందు ఎలాంటి అవగాహన లేకపోవడమే కారణం. ఇప్పటి వరకూ ప్రపంచం లో ఏ దేశం అయినా కరెన్సీ ని ముద్రించుకోవడానికి అందుకు సరిపడా బంగారు నిలువలనో, లేక వనరులనో చూపించాలని విన్నాను. కానీ అమెరికా అలాంటి రూల్ ఏదీ పాటించకుండా కరెన్సీ ని ముద్రించి ప్రపంచ దేశాలకి అప్పులిస్తుందని ఇందులో చదివి ఆశ్చర్యపోయాను. ఇదేమి న్యాయం. ఎవరూ అడగరా?

తెలుగు అనువాదం చాలా సరళంగా సాగింది. మానవాళి విధ్వంసానికి కారణమయ్యే  ఈ అభివృద్ధి (???) అనే ఊబిలో మనం రోజు రోజుకీ ఎలా కూరుకుపోతున్నామో తెల్సుకోవాలంటే ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.


Mr .నూకయ్య



మనోజ్- సనా ఖాన్ ప్రేమించుకుంటారు. రాజా-కృతి కర్బందా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఈ రెండు జంటల మధ్య ప్రేమ ఎలాంటిది, స్వతహాగా దొంగ అయిన మనోజ్ లో పరివర్తన ఎలా వస్తుంది అనేదే ఈ సినిమాలోని కథ.

ఈ కథ కొంచెం కొత్తగానే వుంది. కిడ్నాప్ డ్రామా మధ్య నడుస్తుంది సినిమా అంతా.బోర్ కొట్టకుండా రెండు గంటలు గడిచిపోతాయి. ఆఖరిలో ఊహించని ఒక ట్విస్ట్ చాలా బాగుంది. బ్రాహ్మి చిన్న రోల్ చేసాడు. వేరే ఎవరన్నా అయితే చాలా చిరాగ్గా వుంటుంది కానీ బ్రాహ్మి కాబట్టి భరించగాలిగాము ఆ క్యారెక్టర్ లో. సెకండ్ హాఫ్ లో వచ్చే మొదటి పాట (ఒకే ఒక జీవితం ) లోని సాహిత్యం చాలా బాగుంది. మిగతా పాటలు పర్వాలేదనిపించేలా వున్నాయి. టెక్నికల్ వాల్యూస్ , స్టంట్స్  ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి మనోజ్ నటన తో పాటు. మొదటి సగం మాత్రం బాగా తీయలేదనిపించింది. సెకండ్ హాఫ్ బాగుంది.


మనోజ్ లో చాలా energy వుంది. సినిమా భారం అంతా అతనే మోసాడు చివరిదాకా. సనా ఖాన్ మర బొమ్మలా వుంది, నటన కి పెద్ద ఆస్కారం కూడా లేదు. కృతి కర్బందా తీన్ మార్ లో లాగానే ఇందులో కూడా హోం లీ క్యారెక్టర్ చేసింది. చాలా చక్కగా వుంది. మిగతా అందరూ పర్లేదు.

మనోజ్ చేసిన ఈ కొత్త ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చినట్టే వుంది. వీక్ డే అయినా కూడా హాల్ దాదాపు నిండింది.

నువ్వా- నేనా



గమ్యం లాంటి అసాధారణమయిన సినిమాలో జోడి కట్టి మనల్ని మెప్పించిన శర్వానంద్, అల్లరి నరేష్ ఈ సారి మళ్ళీ జోడి కట్టి కామెడీని ఎలా పండించారో చూడాలనుకుని ఈ సినిమాకి వెళ్లాను. చాలా బాగుంది అనో, అస్సలు బాగోలేదు అనో చెప్పలేను కానీ  ఎలాంటి expectations లేకుండా వెళ్తే ఒకసారి చూసి కొంచెం నవ్వుకుని వచ్చేయ్యొచ్చు.

కథ ఏమీ లేదు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి కోసం ఒకరి పై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ నవ్వుల్నీ పండించడానికి ప్రయత్నిస్తారు. ఆఖరికి గద్దలా మరొకడు ఆ అమ్మాయిని తన్నుకుపోతాడు. మధ్యలో బ్రహ్మానందం, కోవై సరళ ల కామెడీ. బ్రహ్మానందం కామెడీ బాగుంది కానీ కోవై సరళ మాత్రం ఎప్పటిలానే OA  చేసి విసిగిస్తుంది. నరేష్ కి ఇలాంటి రోల్ చేయటం చాలా ఈజీ. అతను బాగా చేసాడు. శర్వానంద్ ని ఇంతవరకూ సీరియస్ రోల్స్ లో చూసి ఇప్పుడు కామెడీ అంటే కొంచెం కొత్తగానే వుంది కానీ చెత్తగా మటుకు లేదు :) పర్వాలేదు అనిపించింది. ఇక శ్రియ లో చాలా ఓల్డ్ లుక్ వచ్చేసింది. పాటలు రెండు బాగున్నాయి, మిగతావి నచ్చలేదు.

హాల్ కి వెళ్లి చూడాల్సిందే అనదగిన సినిమా కాదు. ఇంకో మూడు, నాలుగు నెలల్లో ఎలానూ టీవీ లో వచ్చేస్తుంది. అప్పుడు చూసి నవ్వుకోవచ్చు.

Friday, March 16, 2012

ఇష్క్



సినీ రంగం లో పైకి ఎదగాలంటే టాలెంట్,కృషి తో పాటు కొంత ప్రాక్టికల్ థింకింగ్ కూడా వుండాలి. నేల విడిచి సాము చెయ్యడం అన్ని సార్లు కలిసి రాదు. నితిన్ విషయంలో గత పదేళ్లుగా ఊరిస్తున్న హిట్ ఈ ఇష్క్ సినిమా రూపంలో అతనికి దక్కింది. ఇందులో చిలిపిగా అల్లరి చేసే చలాకి కుర్రాడి పాత్రలో నితిన్ ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్ కోసం శరీరాన్ని కష్టపెట్టడం వలన అనుకుంటా ఆ అలసట ముఖంలో కనిపిస్తుంది. అయితే ముఖంలో maturity వచ్చింది. నిత్య మీనన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మాయి నటనలో చాలా పరిణీతి కనిపిస్తుంది. అజయ్ కి కూడా మంచి పాత్ర దక్కింది. మిగతా నటీ నటులు కూడా చక్కగా చేసారు. పాటలు రెండు, మూడు బాగున్నాయి. ఫోటోగ్రఫి కి మంచి మార్కులు పడతాయి.

కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా ఒక్కో సీన్ జరిగే కొద్దీ ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వల్ అయే అప్పటికి climax ని ఊహించగలం కానీ అక్కడికి కథ ఎలా చేరుకుంటుందో అన్న సస్పెన్స్ వుంటుంది. ఇక కామెడీ కూడా పెద్ద గొప్పగా లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది. మొత్తానికి ఒక సారి చూసెయ్యొచ్చు :)

డేగ రెక్కల చప్పుడు - యండమూరి వీరేంద్రనాథ్

 

నేను చదివిన పుస్తకాలలో నాకు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకాల్లో యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు చాలా వున్నాయి. ఈయన నవలల్లో నేను మొట్ట మొదట చదివింది "నల్లంచు తెల్ల చీర". అప్పటి నుండి ఆయన నవలల్లో మూడు నాలుగు పుస్తకాలు తప్ప మిగతావి ఏవీ  వదిలిపెట్టకుండా చదివేసాను. దొరికినంత వరకూ కొని దాచుకున్నాను కూడా. ఈయన రాసిన కాసనోవ 99 , తులసి దళం, అష్టా వక్ర లాంటి థ్రిల్లర్స్ తెలుగులో మరే రచయిత ఇంత ఆకట్టుకునేలా రాయలేరేమో అనిపిస్తుంది. ఈయన ఇంగ్లీష్ నవలల నుండి కాపీ చేస్తారని, రచనా స్వేచ్చ ఎక్కువ తీసుకుంటారని అంటారు కానీ నేను ఇంగ్లీష్ నవలలు ఎక్కువ చదవలేదు కాబాట్టి నాకు అలా ఏమీ అనిపించదు. ఈయన రాసిన నవలలు అన్నిటి గురించి ఒక పోస్ట్ రాయాలని అనుకుంటున్నాను కానీ కుదరటం లేదు.

ఈ నవల "డేగ రెక్కల చప్పుడు" సాక్షి ఆదివారం edition లో సీరియల్ గా వచ్చినప్పుడు నేను కావాలనే చదవలేదు. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏకబిగిన చదివేయ్యాలి నేను. వారం వారం ఎదురు చూడటం నా వల్ల కాని పని. అందుకే నవలగా వచ్చాక చదివాను. ఇంతకు ముందు ఈయన రాసిన "ఒక వర్షాకాలపు సాయంత్రం" అనే నవల లోని కథకి, ఈ నవలలోని కథకీ దగ్గరి పోలికలు వున్నాయి. అయితే రెండూ వేటికవే బాగున్నాయి.

ఈ కథ విషయానికి వస్తే రామకృష్ణ శాస్త్రి భారత సైన్యం లో పని చేసిన ఒక మాజీ ఉద్యోగి. నరనరాన దేశభక్తి ని జీర్ణించుకున్న అసలు సిసలు సిపాయి. తల్లి తండ్రి ని పోగొట్టుకున్న ఇతనికి ఉన్న ఏకైక తోడు ప్రేమించిన అమ్మాయి వైదేహి. అనుకోని పరిస్థితుల్లో అల్-ఖైదా దృష్టి ఇతని మీద పడుతుంది. వాళ్ళకి అవసరమయిన ఒక ఫైల్ కోసం ఇతన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు. ఈ విషయం అతనికి ఆఖరి నిమిషంలో తెలుస్తుంది. వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసి వాళ్లకి సహాయపడతాడు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యని రామకృష్ణ ఎందుకు ఈ పని చేసాడు, అతని అసలు mission  ఏంటి అన్నది అసలు కథాంశం. ఇందులో మొదటి భాగం అంతా ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక, చారిత్రక నేపధ్యం, తాలిబాన్ల ఆవిర్భావం, ఆఫ్ఘనిస్తాన్ లోని గిరిజన తెగల ఆచార వ్యవహారాలూ,రష్యా-అమెరికాల మధ్య నలిగిపోయిన ఆఫ్ఘన్ పౌరుల హక్కుల గురించి వుంటుంది. 

స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఎత్తుగడలనీ, మత చాంధస వాదుల మూర్ఖపు ఆలోచనలనీ, సామన్యుల బ్రతుకులని నేల రాస్తున్న ఉగ్రవాద సంస్థల అరాచకత్వాన్నీ, వాటికి కొమ్ము కాచే దేశాధినేతల కుయుక్తులనీ, సమాజంలో పాతుకు పోయిన స్వార్థాన్ని, కరడు గట్టిన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రచనా స్వేచ్చ ఎక్కువగా తీసుకున్నప్పటికీ నవల మొత్తం చదివాక అవసరమే అనిపిస్తుంది. కొన్ని యథార్థ సంఘటనలు, కొన్ని కల్పితాలు కలగలిపి రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద కలాపాలకు అద్దం పడుతుంది.

Thursday, February 23, 2012

లవ్ ఫెయిల్యూర్



చిన్న చిన్న గొడవలతో విడిపోయిన ఒక ప్రేమ జంట కథ ఈ సినిమా. కథ కొత్తది కాకపోయినా నడిపించిన తీరు బాగుంది. అరుణ్, పార్వతి ఇద్దరూ ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుతుంటారు. ఇద్దరి మధ్య మొదలయిన చిన్న పరిచయం ప్రేమగా మారుతుంది. తర్వాత కొన్ని చిన్న చిన్న గొడవలు, సర్దుబాట్లు అయ్యాక ఒక సారి అరుణ్ ప్రవర్తన వలన తీవ్రంగా మనస్తాపం చెందిన పార్వతి వాళ్ళ మధ్య వున్న ప్రేమని తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటుంది. అయితే అరుణ్ కి తన తప్పేంటో అర్ధం అవదు. సినిమా మొదటి సగం అంతా ఆన్/ఆఫ్ flashback episodes లో అరుణ్ ప్రేక్షకులకి ఈ కథ చెప్తుంటాడు. వీళ్ళిద్దరి ప్రేమ కథ కి సమాంతరం గా పార్వతి తల్లి తండ్రుల ప్రేమ కథ నడుస్తూ వుంటుంది. ఇంటర్వల్ దాకా కొంచెం బోర్ కొట్టినా సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకుంటుంది. అరుణ్ ఫ్రెండ్స్ తో వచ్చే సన్నివేశాలు, పార్వతి తల్లి తండ్రుల మధ్య జరిగే సంఘటనలు బాగా వచ్చాయి. చివరికి కథ సుఖాంతమవుతుంది.

సిద్ధార్థ్ చాలా రోజుల తర్వాత మంచి సినిమా సెలెక్ట్ చేసుకున్నాడు.అతనికి ఇలాంటి రోల్ చెయ్యడం వెన్నతో పెట్టిన విద్య. అమల పాల్ పక్కింటి అమ్మాయిలా అనిపించింది. నటన కూడా పర్వాలేదు. సురేఖ వాణి, సురేష్, ఇంకా మిగతా పాత్రధారులు కూడా చక్కగా నటించారు. పాటలు మాత్రం నాకు పెద్దగా నచ్చలేదు. ఫోటోగ్రఫి బాగుంది. ఎలాంటి expectations పెట్టుకోకుండా వెళ్తే బాగానే అనిపిస్తుంది ఈ సినిమా. మౌత్ టాక్ బాగా వుంది. పబ్లిసిటీ పట్ల ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని వుంటే బాగుండేది.

Monday, February 20, 2012

తన్హాయి - కల్పనా రెంటాల



ప్రేమ ని గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా నిర్వచించారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ప్రేమ కి ఇదే సరయిన అర్ధం అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. మన సమాజం లో ఎన్నో రకాల ప్రేమలు ఆమోదించబడతాయి కానీ వేరు వేరుగా  పెళ్ళయిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అంటే మాత్రం అందరూ నిరసిస్తారు. స్త్రీ-పురుషుల మధ్య ఏర్పడే ప్రేమలో శారీరక సంబంధానికి చోటు వుండే అవకాశం వలననేమో ఇలాంటి ప్రేమలు ఎవరూ ఒప్పుకోరు. పెళ్ళయిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్నేహంగా మొదలయిన పరిచయం క్రమంగా పెరిగి ప్రేమగా మారి ఇద్దరి కుటుంబాలను, జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో, వాళ్ళ మానసిక సంఘర్షణ ఎలా వుంటుందో అనేదే ఈ కథాంశం.

ఈ కథ అంతా అమెరికా లో రెండు తెలుగు కుటుంబాల మధ్య జరుగుతుంది. కల్హార-చైతన్య దంపతులకు ముద్దులొలికే పాప మేఘన. కౌశిక్-మృదుల దంపతులకు తుషార్ అనే ఏడేళ్ళ బాబు ఉంటాడు. రెండు కుటుంబాలు టెక్సాస్ రాష్ట్రం లోని హ్యూస్టన్ పట్టణంలో వుంటాయి. రెండు జంటలూ ఇండియాలో మధ్య తరగతి కుటుంబాలకి చెందిన వారు. ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ప్రశాంతమయిన జీవితం గడుపుతుంటారు.ఎవరికీ భాగస్వాముల మీద ఎలాంటి కంప్లైంట్స్ వుండవు (చిన్న చిన్న గొడవలు తప్ప). ఒక ప్రయాణంలో కల్హార-కౌశిక్ మధ్య పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోనే ఒకరికి ఒకరు నచ్చుతారు. మొదట స్నేహితులుగా వుందామనుకున్న వారిద్దరూ క్రమేణా ఒకరిని విడిచి ఒకరు వుండలేనంతగా దగ్గరవుతారు. అయితే తమ ప్రేమ కోసం వాళ్ళ వాళ్ళ కుటుంబాలను వదులుకోవాలన్న ఆలోచన వుండదు. వీళ్ళ ప్రేమ విషయం తెల్సిన చైతన్య, మృదుల లు ఎలా స్పందించారు, చివరికి కల్హార-కౌశిక్ ల మధ్య ప్రేమ ఎలా నిలిచిందీ, ఈ క్రమం లో నలుగురూ పడిన మానసిక సంఘర్షణ ని రచయిత్రి ఎంతో హృద్యంగా వర్ణించారు.

ఈ నవల చదివాక ప్రతి పెళ్ళయిన వ్యక్తి ఇందులో వున్న ముఖ్య పాత్రలలో ఏదో ఒక దానిలో తమని తాము identify చేసుకోగలరు. ఇందులో కథ కంటే కూడా పాత్రధారుల మానసిక సంఘర్షణ ను ఎక్కువ హైలైట్ చేసారు. కొన్ని వాఖ్యాలయితే నాకు చాలా చాలా నచ్చాయి,

అశాంతికి కారణం అసంతృప్తి

మనసు మాట వినేవారికి ఉన్నంత నరకం మరోటి వుండదు (ఈ మాట నాకు సరిగ్గా గుర్తు రాట్లేదు. పుస్తకం ఏమో ప్రస్తుతం నా దగ్గర లేదు)

స్నేహం, ప్రేమ అందరి పట్ల ఒకేలా వుండదు. ఒకరి దగ్గర ప్రవర్తించినట్టు, ఫీల్ అయినట్టు మరొకరి దగ్గర ఫీల్ అవలేము, ప్రతి స్నేహం, ప్రేమ వేటికవే విభిన్నం.

ఒక పని చేయాలని తీవ్రంగా అనిపించినప్పుడు ఆ పని చెయ్యడం తప్పు కాదు అని మనసు మనకి అనుకూలంగా నచ్చ చెప్తుంది. అది గుర్తించకపోతే మనసు వేసే ట్రాప్ లో చిక్కుకోక తప్పదు.

ఇంకా ఇలాంటివెన్నో వున్నాయి పుస్తకం నిండా. మొదట సాధారణంగా మొదలయిన కథ లోతుకి వెళ్ళే కొద్దీ పాత్రలన్నీ సజీవంగా మన కళ్ళెదుట నిలిచాయనిపిస్తుంది. ఆ ప్రాత్రల సంఘర్షణలో మన మనసూ, మెదడూ కూడా ఒక భాగమయిపోతాయి. కథాంశం విన్న తర్వాత ఇది అక్రమ సంబంధాలను ప్రోత్సహించేదిగా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ చదివే కొద్దీ తమకే తెలీకుండా పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఇద్దరు బాధ్యాతాయుతమయిన వ్యక్తుల మానసిక స్థితి కి ఇది సజీవ రూపంగా నిలుస్తుంది. మ్యారేజ్ counselling బుక్ లా అనిపించింది నాకయితే.

ఇంత మంచి నవలను అందించిన కల్పన గారికి అభినందనలు.

Image source : Saaranga books


వేలుపిళ్లై - సి.రామచంద్రరావు



నేను ఈ పుస్తకం చదవాలనుకోవడానికి కారణం దీనికి ముళ్ళపూడి వెంకటరమణ గారు, నండూరి రామమోహనరావు గారు రాసిన పరిచయ వాఖ్యలు :) గడిచిన కాలం లో ఈ రచయత రాసినవి ఈ తొమ్మిది కథలే అయినా టాప్ టెన్ రచయతల్లో రామచంద్రరావు గారిని ఒకరిగా చాసో గారు వర్ణించారు అంటే తప్పకుండా ఇవి బాగుండి వుంటాయి అని చదవడం మొదలుపెట్టాను. ఇందులోని కథలన్నీ అరవై-డెబ్బై ఏళ్ళ క్రిందట రాసినవి.రచయిత అప్పట్లో కర్నాటక/తమిళనాడు లోని ఒక టీ-ఎస్టేట్ లో ఉన్నతాధికారిగా పని చేసారు, మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా.

ఈ సంపుటి లో తొమ్మిది కథలున్నాయి. అన్నిటిలో ఏది నచ్చింది అని అడిగితే చెప్పడం కష్టమే. వేటికవే ప్రత్యేకమయినవిగా తోచాయి. ఎక్కువ కథలకు నేపధ్యం టీ-ఎస్టేట్ లోని జీవితమే. స్త్రీ-పురుషల సంబంధాలు, భార్య-భర్తల అనుబంధాలు, యజమాని-నౌకరు సంబంధాలు, సహోద్యోగుల మధ్య వుండే వాతావరణం, మనిషికి-జంతువుకి మధ్య వుండే సున్నితమయిన సెంటిమెంట్స్ ఇలా మానవ సంబంధాలలో వున్న అనేకానేక కోణాలను స్పృశిస్తూ రాసిన కథలు ఇవన్నీను. ఒక్కో కథ రాయడం కోసం రచయిత చేసిన పరిశీలన మెచ్చుకోదగినది. ముఖ్యంగా 'ఏనుగులరాయి' కథలో ఏనుగుల మనస్తత్వాన్నీ, కడకరైకీ-ఏనుగులకీ మధ్య వుండే అనుబంధాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఎంతో పరిశీలనా దృష్టి వుంటే కానీ ఇది సాధ్యపడదు. కథల్లోని పాత్రలన్నీ సజీవంగా, వాస్తవికంగా వున్నాయి.

ఈ కథల్లోని పాత్రదారులు ఎక్కువ మంది తమిళ తంబిలు, ఇంకా తెల్ల దొరలూ. అయినా స్వచ్ఛమయిన తెలుగు కథలు చదువుతున్నట్టే అనిపించింది. తెలుగు కథ రాయడానికి ప్రాత్రధారులు, నేపధ్య వాతావరణం తెలుగు మాత్రమే కానవసరం లేదు అని అనిపిస్తుంది ఈ పుస్తకం చదివాక. పడమటి కనుమల మధ్య, పచ్చటి టీ-కాఫీ తోటల్లో విహరిస్తూ స్వచ్ఛమయిన గాలి పీలుస్తూ మంచి కాఫీ తాగుతున్న ఫీలింగ్ వచ్చింది ఈ కథలు చదువుతుంటే.

Friday, February 17, 2012

ఒక హిజ్రా కథ - పరవస్తు లోకేశ్వర్



ఉర్దూ, హిందీ భాషలలోని 8 కథలను పరవస్తు లోకేశ్వర్ గారు అనువదించి ఈ పుస్తక రూపం లో అందించారు. ఇందులో మూడు కథలు కుష్వంత్ సింగ్ రాసినవి కాగా మిగతా అయిదూ వేరు వేరు రచయితలు రాసినవి. కుష్వంత్ సింగ్ రాసిన మూడు కథలూ 17 - 18 శతాబ్దాలలో మొఘల్ సామ్రాజ్యం మరియూ సిపాయి తిరుగుబాటు ల నేపధ్యాలలో రాసినవి. చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కేవలం చరిత్ర పుస్తకాలు చదివితే సరిపోదు. ఎందుకంటే అందులో రాజులు, వాళ్ళ పాలనా విధానాలు, జరిగిన యుద్ధాలు, ఆస్తుల లెక్కలు, రాజకీయ ఒప్పందాలు, తారీఖులు ఇవి మాత్రమే వుంటాయి. అప్పటి కాలంలో ప్రజల మనోభావాలు, సంఘర్షణలు కూడా చరిత్రలో భాగమే. ఇవి దాదాపుగా ఏ చరిత్ర పుస్తకంలోనూ కనిపించవు. ఇవి తెల్సుకోవాలంటే అప్పటి కాలం లో జీవించిన సామాన్యుల కథలు చదవాలి. ఈ మూడు కథల లోనూ  అప్పటి ప్రజల జీవన విధానాలు, ఆలోచనలు, యుద్ధాల వలన వాళ్ళ జీవితాల్లో వచ్చిన పెను మార్పులూ అన్నీ చక్కగా వర్ణించబడ్డాయి.

ఇక మిగతా కథలలో నాకు మొదటి కథ 'గృహ నిర్మాత' , రెండవ కథ ' పరువు-ప్రతిష్ట' బాగా నచ్చాయి. మొదటి కథలో వేశ్య అయిన లాజ్వంతి వివాహం ద్వారా స్వేచ్ఛను కోల్పోతే (సమాజం లో ఒక గౌరవమయిన స్థానం పొందినప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతుంది), రెండవ కథలో పటాన్ల అమ్మాయి స్వేచ్ఛగా జీవించగలిగి ఉండి కూడా  మనసిచ్చిన వాడి కోసం, కుటుంబ పరువు కోసం వివాహం మాట తలపెట్టకుండా తనకు తానే సంకెళ్ళు వేసుకుని జీవితమంతా గడిపేస్తుంది. విభిన్న పరిస్థితులలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళ సంఘర్షణకి ఈ రెండు కథలూ అద్దం పడతాయి. ఇక అనుకోని పరిస్థితులలో హిజ్రాగా మారిన మైనా కథ కంట తడి పెట్టిస్తుంది.

భాష కూడా సరళంగా ఉండి చదవడానికి తేలికగానే ఉంది.

ఇదీ నా కథ - మల్లెమాల


మల్లెమాల గారి గురించి తలచుకోగానే నాకు గుర్తొచ్చేవి రెండే విషయాలు, అంకుశం సినిమాలో ఆయన రోల్, బాల రామాయణం సినిమా. ఆయన్ని చూస్తే పాత కాలం లో వుండే స్ట్రిక్ట్ ప్రధానోపాధ్యాయుడు గుర్తొస్తారు. ఈ మధ్య ఆయన తన గురించి రాసుకున్న ఈ పుస్తకం గురించి చాలా వార్తలే విన్నాను.ఇలాంటివి విన్న కొద్దీ చదవాలన్న ఆసక్తి పెరుగుతుంది కదా. పైగా మా జిల్లా ఆయన కదా, ఇక చదవాలనే అనుకున్నాను. అమ్మమ్మ దగ్గర ఈ పుస్తకం వుంది, చదివేసాను.

మల్లెమాల గారు కవి అని తెల్సు కానీ ఎప్పుడూ ఆయన రాసిన గేయాలు, గట్రా చదవలేదు. ఈ పుస్తకంలో చదువుతున్నప్పుడు హై-స్కూల్ చదువు కూడా లేకపోయినా ఇంత బాగా ఛందస్సు, వ్యాకరణం మీద పట్టు సాధించడం చాలా గొప్ప విషయమే అనిపించింది. ఇక ఆయన మనసు విప్పి తన గురించి చెప్పుకున్న విషయాలలో ఎక్కువ భాగం తను సాధించిన విజయాల గురించే వున్నా కూడా ఏంటో చాలా మామూలుగా చెప్పినట్టే వుంది కానీ కావాలని తన గురించి తాను ఎక్కువ చేసి గొప్పలు చెప్పుకున్నట్టు లేదు. రామారావు, శోభన్ బాబు, గుణశేఖర్, బుజ్జి రామారావు (Jr NTR ), శ్యాం ప్రసాద్ రెడ్డి -  వీళ్ళందరి గురించి విమర్శించారు. వీళ్ళంతా కూడా మనకి ఒక రకమయిన వ్యక్తులుగానే తెలుసు, కానీ ప్రతి ఒక్కరిలో వేరు వేరు కోణాలున్నట్టే వీరి జీవితంలో కూడా మనకి తెలీని చాలానే విషయాలు జరిగి ఉండి ఉండవచ్చు. మల్లెమాల గారు తనకి ఎదురయిన చెడు అనుభవాలు వ్యక్తపరిచే  క్రమంలో వీళ్ళ పేర్లు బయటకి వచ్చాయి, అంతే. ఇవి నిజాలా కాదా అనేది నేను పట్టించుకోను. ఆయా వ్యక్తుల మీద నాకు అంతకు ముందున్న అభిప్రాయం ఇవి చదివాక మారదు కూడా :)

మొత్తం మీద పుస్తకం అయితే బాగుంది.